Share News

మళ్లీ చిగురిస్తున్న ‘చేర్యాల’ ఆశలు!

ABN , Publish Date - Apr 03 , 2026 | 10:40 AM

ఒకప్పుడు రాజకీయంగా వెలుగొందిన చేర్యాల ప్రాంతం ఇప్పుడు తన అస్తిత్వం కోసం పోరాడుతోంది.

మళ్లీ చిగురిస్తున్న ‘చేర్యాల’ ఆశలు!

  • నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ.. పాత వైభవం దక్కేనా?

  • రెవెన్యూ డివిజన్‌ ఊసే లేదు..

  • జమిలీ ఎన్నికలతోనైనా అదృష్టం వరించేనా?

చేర్యాల(సిద్దిపేట): ఒకప్పుడు రాజకీయంగా వెలుగొందిన చేర్యాల ప్రాంతం ఇప్పుడు తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. నిన్నటి వరకు రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం ఉద్యమించిన స్థానిక ప్రజలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనపై గంపెడాశలు పెట్టుకున్నారు. 2029లో జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు పడుతుండటంతో, గతంలో కనుమరుగైన చేర్యాల నియోజకవర్గం మళ్లీ పురుడుపోసుకుంటుందన్న ఆశలు చిగురిస్తున్నాయి.


చారిత్రక నేపథ్యం

1957కు పూర్వం నల్లగొండ జిల్లా పరిధిలో చేర్యాల తాలూకా కేంద్రంగా కొనసాగింది. ఆ సమయంలో జనగామ కూడా చేర్యాల తాలూకాలో అంతర్భాగంగా కొనసాగింది. 1962లోచేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట మండలాలతో పాటు జనగామ మండలంలోని రెండు గ్రామాలు, రఘునాథ పల్లి మండలంలోని మూడు గ్రామాలతో చేర్యాల నియోజకవర్గం-261గా ఏర్పడింది.


2009లో కనుమరుగు

1957 నుంచి 2008 వరకు12సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు కాంగ్రె్‌సకు, మూడుసార్లు టీడీపీ, రెండుసార్లు టీఆర్‌ఎ్‌సకు, సీపీఐకి ఒకసారి, స్వతంత్రుడికి ఒకసారి పట్టం కట్టారు. 2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో చారిత్రక, భౌగోళికంగా అన్ని అర్హతలున్నప్పటికీ చేర్యాలకు అన్యాయం జరిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 261-చేర్యాల నుంచే ప్రారంభమైనా పునర్విభజనలో నాలుగు మండలాలతో కూడిన చేర్యాలలో ఇతర ప్రాంతాలను విలీనం చేయాల్సి ఉన్నా జనగామ మండలంలో విలీనం చేయడంతో కనుమరుగైంది. చేర్యాల మండలాన్ని విడగొట్టి కొమురవెల్లిని కొత్త మండలంగా చేశారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో చేర్చగా.. బచ్చన్నపేట, నర్మెట్ట మండలాలను జనగామలో కలిపారు. దీనివల్ల ఈ ప్రాంతం రెండు వేర్వేరు జిల్లాలు, వేర్వేరు రెవిన్యూ డివిజన్ల పరిధిలోకి వెళ్లి అనాథగా మారింది.


hnk1.2.jpgఅన్ని అర్హతలు

నియోజకవర్గాల పెంపుతోనే చేర్యాల ఆవిర్భావమయ్యే పరిస్థితులున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 నియోజక వర్గాలున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు పరిధి, పాత జిల్లాల ప్రాతిపదికనో.. కొత్త జిల్లాల ప్రామాణికతలో ఏవిధంగా చూసినా ఏడు లేదా తొమ్మిది నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో జనాభాతో పాటు చారిత్రకంగా డిప్యూటీ కమిషనర్‌ స్థాయి హోదా కలిగిన మల్లన్న ఆలయం ఉండటం, భౌగోళికంగా అర్హతలున్నందున చేర్యాలకు ప్రాధాన్యం దక్కనుందన్న ప్రచారం సాగుతుంది.


2011 జనాభా లెక్కల ప్రకారం చేర్యాల మండలంలో 52,778 జనాభా, 38 వేలకుపైగా ఓటర్లు, కొమురవెల్లి మండలంలో 18,040 జనాభా, 13,612 ఓటర్లు, మద్దూరు ఉమ్మడి మండలంలో 38,731జనాభా, 28,069మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 2లక్షల మేర జనాభా ప్రాతిపదికన నియోజకవర్గం ఉండగా, పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో సుమారు 50 స్థానాలు పెరగనున్నందున లక్ష జనాభా ఉన్నా నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి జనాభా అంతకుమించి ఉన్న నేపథ్యంలో, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల జనాభా సరిపోనుండటంతో మల్లన్న వెలిసిన కొమురవెల్లి పేరిట చేర్యాలను కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని అంచనా వేస్తున్నారు.


అడ్డంకిగా మారిన రాజకీయ విభేదాలు

చేర్యాల అభివృద్ధికి స్థానిక రాజకీయ వైరుధ్యాలు ప్రధాన శాపంగా మారాయి. రెవెన్యూ డివిజన్‌ సాధనకు గతంలో కాంగ్రెస్‌, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పోరాటాలు చేస్తున్నా.. అధికారంలో ఉన్న పార్టీల ప్రాధాన్యతలు మారుతుండటంతో ఫలితం దక్కడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇరుపార్టీల అధినేతలు కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి డివిజన్‌పై హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌ గెలిచినా బీఆర్‌ఎస్‌ అధికారంలో లేకపోవడం, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా కొమ్మూరి ఓటమి చెందడంతో పరిపాలన, అభివృద్ధి, ఇతరత్రా విషయాలలో వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల హామీలు ఇచ్చిన నేతలు, ఇప్పుడు అధికార-ప్రతిపక్ష సమీకరణాల మధ్య ఈ ప్రాంత సమస్యలను గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!

బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2026 | 10:55 AM