Share News

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:59 AM

మిరప రైతుల కష్టాలు తీరడం లేదు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉన్నప్పుడు దిగుబడి ఉండదు. దీంతో సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు.

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

  • మిరప రైతులను వెంటాడుతున్న కష్టాలు

  • దిగుబడిపై తెగుళ్లు, మొంథా తుఫాను ప్రభావం

  • మూడు నెలల్లోనే రూ.30 వేలు తగ్గిన ధర

ఉరవకొండ(అనంతపురం): మిరప రైతుల కష్టాలు తీరడం లేదు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉన్నప్పుడు దిగుబడి ఉండదు. దీంతో సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఉరవకొండ నియోజకవర్గంలో పుష్కర కాలం నుంచి మిరప సాగు గణనీయంగా పెరిగింది. హెచ్చెల్సీ, జీబీసీ, హంద్రీనీవా కాలువలతో పాటు బోరుబావుల కింద సుమారుగా 30వేల ఎకరాల్లో మిరపసాగు అయ్యింది. ఈ ఏడాది ఇప్పటికే 80శాతం పైగా పంట రైతుల చేతికి వచ్చింది. నల్లతామర, తెగుళ్లతో పాటు, మొంథా తుఫాన్‌ కూడా దిగుబడిపై ప్రభావం చూపింది.


నవంబరు, డిసెంబరు నెలలో అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల పంటను కాపాడుకునేందుకు రైతులు రోజు మార్చి రోజు మందులను పిచికారీ చేశారు. దీంతో ఖర్చు తడిసి మోపెడయ్యింది. మూడు నెలల కిందట డబ్బీ రకం క్వింటా రూ.85వేలు పలకగా ప్రస్తుతం రూ.55వేల నుంచి, రూ.65వేల మధ్య నడుస్తోంది. దిగుబడిని విక్రయించేందుకు రైతులు పొలాల్లోనూ, మార్కెట్‌ యార్డులో నిల్వ చేసుకుని వ్యాపారుల కోసం ఎదురుచూస్తున్నారు.


రూ.లక్షల్లో పెట్టుబడి

దుక్కిదున్నడం, విత్తనాలు, మొక్కలు నాటిన కూలితో పాటు, ఎరువులు, పురుగుమందులు, పంటకోత కూలీలకు ఇలా ఎకరా విస్తీర్ణంలో మిరప సాగుకు మొత్తం పెట్టుబడి రూ.1.5లక్షలు పెట్టారు. కౌలు రైతులు అయితే మరో రూ.50వేలు అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎకరాకు సాధారణంగా 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాలి. ఈసారి 8 నుంచి 10 క్వింటాళ్ల మాత్రమే వచ్చింది. దీంతో ధర ఓ మోస్తరుగా ఉన్నా దిగుబడి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


pandu2.2.jpgమంచి ధర వచ్చే వరకు పంట దిగుబడులను నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేక రైతులు పొలాల్లో చెట్ల కిందే రాశులుగా పోశారు. సాధారణంగా మిరప దిగుబడులను శీతల గిడ్డంగులలో నిల్వ చేయాలి. అలాంటి సదుపాయం జిల్లాలో ఎక్కడా లేదు. ఒక వేళ నిల్వ చేయాలంటే బ్యాడిగి, బళ్లారి, గుంటూరు ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. అదంతా మరింత వ్యయప్రయాసలతో కూడిన పని. జిల్లాలోనే ఏదో ఒక మార్కెట్‌లో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.


అమ్మాలంటే కర్ణాటకకు వెళ్లాలి

నాలుగున్నర ఎకరాల్లో పంట సాగుచేశా. ఎకరాకు రూ.2లక్షల దాకా పెట్టుబడి పెట్టాం. గత ఏడాదితో పోలిస్తే దిగుబడి కొంత పెరిగింది. క్వింటా ధర రూ.55వేలకు మించి అడగడం లేదు. తుఫాను, తెగుళ్లు దిగుబడిపై ప్రభావం చూపాయి. పండిన పంటను అమ్ముకోవాలంటే కర్ణాటకకు వెళ్లాల్సి వస్తోంది.

- కిష్టప్ప, రైతు, ఉరవకొండ


జనవరిలో మంచి ధర

జనవరిలో డబ్బీ ధర రూ.80 వేల నుంచి రూ.90వేల దాకా పలికింది. 20 రోజుల్లోనే ధర భారీగా పడిపోయింది. ఇప్పుడు రూ.50వేలు పలుకుతోంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. చేసిన కష్టమంతా పెట్టుబడికే సరిపోతుంది. ఈ ఏడాది నల్లితెగులుతో పెట్టుబడి మరింత పెరిగింది.

- శివయ్య, రైతు, ఉరవకొండ


ఈ వార్తలు కూడా చదవండి:

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!

బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2026 | 09:59 AM