Share News

మునిసిపల్ పోరులో కీలకం కానున్న ఎక్స్ అఫీషియో ఓట్లు

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:39 AM

మునిసిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. మునిసిల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో కార్పొరేటర్లు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి.

మునిసిపల్ పోరులో కీలకం కానున్న ఎక్స్ అఫీషియో ఓట్లు
Nizamabad Municipal Elections

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు

  • మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల గెలుపులో వారే కీలకం

  • ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఆప్షన్లకు అవకాశం

నిజామాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునిసిపల్ ఎన్నికల్లో (Nizamabad Municipal Elections) ఎక్స్ అఫీషియో ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. మునిసిల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో కార్పొరేటర్లు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. అదికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్‌లకు జిల్లాలోని పలు కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఉన్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌నే ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు హక్కును కల్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీలకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. జిల్లాలో ఎంపీ అర్వింద్ ధర్మపురి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ నుంచి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిచిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణగుప్తా భూపతిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు జిల్లాలో ఎక్కడో ఒక చోట ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.


నిజామాబాద్ కార్పొరేషన్‌లో అర్బన్ ఎమ్మెల్యేతో పాటు రూరల్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే, బోధన్ ఎమ్మెల్యే, ఎంపీ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. స్థానిక బలాబలాలను బట్టి స్థానిక ఎమ్మెల్యేలు అయా మున్సిపాలిటీల పరిధిలో ఓటు హక్కు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఓటు వేస్తారో ఎన్నికల అధికారులకు ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెద‌క్ ఉమ్మడి జిల్లాల నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అంజిరెడ్డి, మల్క కొమురయ్యల ఓటు హక్కు విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు పరిధిలో ఎక్కడైనా తమ ఆప్షన్ ఇచ్చుకోవచ్చా లేదా అనేది తెలియాల్సి ఉంది.


జిల్లాలో ఎక్స్ అఫీషియో వీరే..

జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డికి ఆర్మూర్ మునిసిపాలిటీతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా ఒకచోట ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు బోధన్ మునిసిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.


బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి భీంగల్ మునిసిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. బీఆర్‌ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డికి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆయన భీంగల్ మున్సిపాలిటీలోనే ఓటు హక్కు వినయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిచిన బీజేపీకి చెందిన అంజిరెడ్డి, ముల్క కౌమురయ్యలకు ఎక్స్ అఫీషియో ఓటు ఉండగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కడైనా ఒకచోట ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జిల్లాలో కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలలో ఎక్కడైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కానీ ఆయన నిజామాబాద్ కార్పొరేషన్‌లోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 10:39 AM