అనుమతి లేకున్నా.. అడ్మిషన్లు..!
ABN , Publish Date - May 27 , 2026 | 12:01 PM
2026-27 నూతన విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభమవుతున్న తరుణంలో గ్రేటర్‌లోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి.
స్పెషల్ డిస్కౌంట్‌తో ప్రైవేట్ ఇంటర్ కాలేజీల ప్రచారం
తొలుత తమ వద్ద చేరిక.. తర్వాత మరో చోట నామినల్ రోల్స్
విద్యార్థులను మోసం చేస్తున్న పలు యాజమాన్యాలు
ఏటా ఇదే తంతు.. పట్టించుకోని అధికారులు
దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఇంటర్ కాలేజీ ఇతర రాష్ట్రంలోని పేరొందిన కళాశాలకు అనుబంధంగా కొనసాగుతోంది. దీనికి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేదు. కాగా, ఈ కాలేజీతోపాటు హిమాయత్‌నగర్, హబ్సిగూడ, మాదాపూర్, మియాపూర్‌లో మొత్తం 5 బ్రాంచిలుండగా.. అందులో హబ్సిగూడ, మియాపూర్ కళాశాలలకు మాత్రమే గుర్తింపు ఉంది. మిగతా మూడింటికి పర్మిషన్ లేదు. ఏడేళ్లుగా అనుమతి లేకున్నప్పటికీ నిర్వాహకులు దర్జాగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఆయా చోట్ల చేరుతున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌ను తమకు సంబంధించిన ఇతర కళాశాలల ద్వారా ఇంటర్‌బోర్డుకు పంపిస్తూ తల్లిదండ్రులను దగా చేస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు.
మాదాపూర్‌లో మరో కాలేజీకి కూడా గుర్తింపు లేదు. ఇది నగరంలోని ఓ పేరొందిన విద్యాసంస్థ పేరును వాడుకుంటూ సదరు యాజమాన్యానికి ఏటా కొంత మొత్తాన్ని చెల్లిస్తోంది. కాలేజీలో చేరుతున్న పిల్లలను అక్కడ చదువుతున్నట్లుగా చూపిస్తూ పరీక్షలు రాయిస్తోంది. ఫస్టియర్, సెకండియర్‌కు కలిపి తాము కేవలం రూ.2.20 లక్షల వరకు మాత్రమే ఫీజు తీసుకుంటామని అడ్మిషన్ల సమయంలో తల్లిదండ్రులను నమ్మిస్తుంటారు. కాగా, వార్షిక పరీక్షలప్పుడు అదనంగా మరో రూ.లక్ష ఇస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని విద్యార్థులను బెదిరిస్తుంటారని పేరెంట్స్ వాపోతున్నారు.
హైదరాబాద్ సిటీ: 2026-27 నూతన విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభమవుతున్న తరుణంలో గ్రేటర్‌లోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. తమ పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆరాట పడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొన్ని కళాశాలలు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా అనుమతి లేని కాలేజీలు డిస్కౌంట్ పేరుతో విద్యార్థులను మోసగిస్తున్నా.. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 285, రంగారెడ్డి జిల్లాలో 180, మేడ్చల్‌లో 126 ప్రైవేట్ విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అలాగే మూడు జిల్లాల్లో కలిపి పేరొందిన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు 320 వరకు ఉన్నాయి. మొత్తం 591 ప్రైవేట్ కాలేజీల్లో 350 వరకు అనధికారికంగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్లు, రోడ్డు పక్కన కాంప్లెక్స్‌ల్లో చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని తరగతులను నిర్వహిస్తున్నా.. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకున్నా.. అడిగే వారు ఉండని పరిస్థితి నెలకొంది.
పర్మిషన్ లేకున్నా.. అడ్డగోలుగా..!
గ్రేటర్‌లో ఏటా ఇంటర్మీడియట్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పది మంది అధ్యాపకులు కలిసి చిన్నపాటి గదులను కిరాయుకి తీసుకుని తరగతులను ప్రారంభిస్తున్నారు. తమ వద్ద నాణ్యమైన విద్యనందిస్తామని అడ్మిషన్ల సమయంలో ఫ్లెక్సీలు, కరపత్రాలతో పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. పేరొందిన కాలేజీల కంటే తాము 30-40 శాతం వరకు తక్కువ ఫీజుతో బోధనలు అందిస్తామని, ఐఐటీ, జేఈఈ, నీట్ క్లాసులను ప్రత్యేకంగా అందిస్తామని తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు. అయితే అక్కడ చేరుతున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఇతర కళాశాలల ద్వారా ఇంటర్‌బోర్డుకు పంపించడం, పాసైన తర్వాత టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లను అక్కడి నుంచే ఇప్పిస్తుండడంతో పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. తక్కువ ఫీజు అని చెబితే చేర్పించిన పాపానికి నిలువునా మోసం చేస్తున్నారని, పరీక్షల్లో పిల్లలకు ఆశించిన మార్కులు కూడా రావడంలేదని వారు వాపోతున్నారు.
అనుమతి లేని వాటిని మూసివేయాలి..
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య కీలకమని, అడ్మిషన్లు తీసుకునే సమయంలో మంచి కాలేజీలను ఎంచుకుని పిల్లలను చేర్పించాలని, లేకుంటే వారి భవిష్యత్ ఆగమవుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. తక్కువ ఫీజుతో ఇంటర్ కోర్సులు చెబుతామని ప్రచారం చేసే యాజమాన్యాల మాటలను విని మోసపోవద్దని, అసలు కాలేజీలకు ఇంటర్‌బోర్డు నుంచి అనుమతి ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటున్నారు. అనుమతి లేని కాలేజీలపై చర్యలు తీసుకుని వాటిని మూసివేయాలని డీవైఎ్‌ఫఐ హైదరాబాద్ నగర కార్యదర్శి ఎండీ జావిద్ అధికారులను డిమాండ్ చేశారు.
అనుమతి లేని వాటిని మూసివేయాలి..
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య కీలకమని, అడ్మిషన్లు తీసుకునే సమయంలో మంచి కాలేజీలను ఎంచుకుని పిల్లలను చేర్పించాలని, లేకుంటే వారి భవిష్యత్ ఆగమవుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. తక్కువ ఫీజుతో ఇంటర్ కోర్సులు చెబుతామని ప్రచారం చేసే యాజమాన్యాల మాటలను విని మోసపోవద్దని, అసలు కాలేజీలకు ఇంటర్‌బోర్డు నుంచి అనుమతి ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటున్నారు. అనుమతి లేని కాలేజీలపై చర్యలు తీసుకుని వాటిని మూసివేయాలని డీవైఎ్‌ఫఐ హైదరాబాద్ నగర కార్యదర్శి ఎండీ జావిద్ అధికారులను డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
డిజిటల్ చెల్లింపులతో జర భద్రం
Read Latest AP News And Telangana News And International News And Telugu News