Share News

ఏఐతో తగ్గే ఉద్యోగావకాశాలు.. భారతీయ యువత అభిప్రాయం ఇదే

ABN , Publish Date - May 25 , 2026 | 10:18 PM

ఏఐపై యూనివర్సిటీ విద్యార్థులు, పట్టభద్రుల అభిప్రాయం ఏంటో తెలుసుకునేందుకు సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఏఐతో తగ్గే ఉద్యోగావకాశాలు.. భారతీయ యువత అభిప్రాయం ఇదే
AI impact on jobs

ఇంటర్నెట్ డెస్క్: నచ్చిన రంగంలో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఏఐ వల్ల తగ్గుతాయని భారతీయ యువతలో 74 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎంచుకున్న రంగంలో విజయం సాధించేందుకు కావాల్సిన నైపుణ్యాలు కూడా తమవద్ద ఉన్నాయని మరో 93 శాతం మంది అభిప్రాయపడ్డారు. సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన 2026 గ్రాడ్యుయేట్ ఔట్‌లుక్ సర్వేలో ఈ ఆసక్తికర అభిప్రాయాలు వెల్లడయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్థులు, ఇటీవల చదువు పూర్తి చేసుకున్న వారి అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. సర్వే ప్రకారం, భారతీయ పట్టభద్రుల్లో అత్యధిక శాతం మంది ఫైనాన్స్ రంగాన్ని ఎంచుకున్నారు. ఈ రంగంలో తమ కెరీర్‌కు ఢోకా లేదని 40 శాతం మంది చెప్పారు. ఐటీ రంగంపై ఇప్పటికీ 31 శాతం మంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. నచ్చిన రంగాల్లో ఉపాధి దొరుకుతుందన్న విశ్వాసం ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయ యువతలో ఎక్కువగా కనిపించినట్టు సర్వే తేల్చింది. ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో కూడా తమకు ఉద్యోగావకాశాలు ఉన్నాయని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు.


మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేసేందుకు అత్యధిక శాతం మంది యువత ఆసక్తిని ప్రదర్శించారు. భారతీయ కంపెనీలు, స్టార్టప్స్, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఏఐతో కలిగే ప్రభావంపై యువతలో అవగాహన ఉన్నట్టు కూడా సర్వే తేల్చింది. ఏఐ ఆధారిత రిక్రూట్‌మెంట్, పోటీ విషయంలో కూడా యువతలో కొంత ఆందోళన కనిపించింది. వృత్తిజీవితంలో ఏఐ వినియోగించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని సర్వేలో పాల్గొన్న 81 శాతం మంది చెప్పారు. జాబ్ మార్కెట్‌లో తమకు ఇతర అభ్యర్థులపై పైచేయి సాధించే అవకాశం ఏఐ వల్ల కలుగుతుందని మరో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏఐ జమానాలో మనుషుల మధ్య సంబంధాలు, సాఫ్ట్ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరిగిందని 92 శాతం మంది చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

AC ఎక్కువ కాలం పనిచేయాలంటే ఇలా చేయండి

Updated Date - May 25 , 2026 | 10:26 PM