Share News

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

ABN , Publish Date - May 14 , 2026 | 01:49 PM

విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి.

 పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు
Private Schools

  • నిబంధనలకు తిలోదకాలు..

  • అందినకాడికి దండుకుంటున్న వైనం

  • అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన

గజ్వేల్‌(మెదక్): విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు చిల్లు పడుతోంది.

గల్లీ గల్లీకో పాఠశాల.. అనుమతులు నిల్‌!

గజ్వేల్‌ పట్టణంలోని ప్రతి వీధిలోనూ ఒక పైవ్రేటు పాఠశాల వెలుస్తోంది. వ్యాపార దృక్పథంతో ఏటా కొత్త పాఠశాలలు ప్రారంభమవుతున్నా, వాటికి సరైన ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జూన్‌ 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇరుకు గదుల్లో కనీస సౌకర్యాలు లేని భవనాల్లోనూ ఆకర్షణీయమైన ప్రచారాలతో అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. కొన్ని చోట్ల బ్రాండెడ్‌ సంస్థల పేర్లను వాడుకుంటూ తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు.


నిబంధనలకు పాతర

పాఠశాలను స్థాపించాలి అంటే ముందు విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుం చెల్లించి అనుమతులు పొందాలి. పట్టణాల్లో 1000 చదరపు మీటర్లు, గ్రామాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం ఉండాలి. అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వేర్వేరు మరుగుదొడ్లు, లైబ్రరీ, ప్రసార సాధనాలు ఉండాలి. రూ.50వేలు ఎండోమెంట్‌ రుసుం చెల్లించాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా పాఠశాలలకు కనీస ఆటస్థలం కూడా లేదు.


తప్పనిసరిగా టీవీ, రేడియో వంటి ప్రసార సాథనాలు అందుబాటులో ఉండాలనే నిబంధనలున్నా చాలా పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యాభోధన జరుగుతుంది. ఇక అనుమతి లేని పాఠశాలల్లో చేరితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని, భవిష్యత్తులో బోనఫైడ్‌ అందక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గజ్వేల్‌లో 15 హైస్కూల్స్‌ ఉండగా, దాదాపు 20వరకు అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలు, 10 వరకు ప్రైమరీ పాఠశాలలుండగా, నియోజకవర్గంలోని ములుగులో భారీగా ప్రైవేటు పాఠశాలలు వెలుస్తున్నాయి. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణ లు ఉన్నాయి.


zzzz.jpgశిక్షణ లేని బోధన.. ఫీజుల బాదుడు!

ప్రైవేట్‌ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు భావిస్తుంటే, యాజమాన్యాలు మాత్రం తక్కువ జీతాలకే లభించే అనర్హులైన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నాయి. ప్రాథమిక స్థాయికి డీఈడీ, ఉన్నత తరగతులకు బీఈడీ అర్హత ఉండాలన్న నిబంధన ఉన్నా, కేవలం ఇంటర్‌, డిగ్రీ చదివిన వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారు. మరోవైపు ఫీజుల వసూళ్లకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పట్టణంలోని సాదాసీదా పాఠశాలల్లోనూ ఎల్‌కేజీ సీటుకు రూ.20 వేల నుంచి వసూలు చేస్తుండటం గమనార్హం.


ప్రభుత్వ పాఠశాలలను ఆదరించండి

రాష్ట్ర ప్రభుత్వం టెట్‌, బీఈడీ వంటి కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన నైపుణ్యం గల ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో నియమిస్తోంది. ఉచిత భోజనం, అల్పాహారం, పాఠ్యపుస్తకాలు వంటి వసతులు కల్పిస్తోంది. అయినప్పటికీ, టై, షూస్‌, బెల్టుల మోజులో పడి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం సామాజిక హోదా కోసం కాకుండా, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అర్హత గల ఉపాధ్యాయులున్న పాఠశాలలను ఎంచుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.


విద్యాశాఖ అధికారుల మౌనంపై విమర్శలు

నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌తో పాటు ములుగు వంటి ప్రాంతాల్లో భారీగా వెలుస్తున్న అక్రమ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం తనిఖీలు చేపట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్

రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 01:52 PM