ఎంఎస్సీ కోర్సులకు జేఎన్‌టీయూ రాంరాం..!
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:06 AM
జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) కోర్సులకు ఇకపై కాలం చెల్లినట్లేనా అంటే.. అవుననే అంటున్నారు అక్కడి విద్యార్థులు.
సిబ్బంది కొరత, సీట్లు భర్తీకాకపోవడమే కారణమంటున్న అధికారులు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) కోర్సులకు ఇకపై కాలం చెల్లినట్లేనా అంటే.. అవుననే అంటున్నారు అక్కడి విద్యార్థులు. పీజీ కోర్సుల నిర్వహణకు సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడం, యూజీ కోర్సులకు మరింత మంది సిబ్బంది అవసరం ఏర్పడడంతో యూనివర్సిటీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు దశాబ్దంన్నరకు పైగా బోధనా సిబ్బంది నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టకపోవడం, కొందరు మాజీ వీసీల హయాంలో ఇబ్బడిముబ్బడిగా కోర్సులను ప్రవేశపెట్టడంతో ఆయా కోర్సులను ఇప్పటి వరకు కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకు వస్తున్నారు.
దీంతో విద్యా ప్రమాణాల్లో నాణ్యత కొరవడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పీజీ కోర్సుల్లో సబ్జెక్టులను బోధించేందుకు కనీ సం 50శాతం మంది రెగ్యులర్ ఆచార్యులు ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయితే, కొన్ని కోర్సులకు ఒక్కరు కూడా రెగ్యులర్ స్టాఫ్ లేకపోవడంతో ఆ కోర్సుల నిర్వహణ భారంగా పరిణమించిందని ఉద్యోగులు చెబుతున్నారు.
సగానికి పైగా సీట్లు ఖాళీ
ఇంకోవైపు ఇంజనీరింగ్ కోర్సులపై ఉన్న క్రేజుతో విద్యార్థులు ఎంఎస్సీ కోర్సులవైపు ఆసక్తి చూపడం లేదని, కొన్ని కోర్సుల్లో ఉన్న సీట్లలో సగానికి పైగా భర్తీకాకపోవడం కూడా కోర్సుల ఎత్తివేతకు మరో కారణంగా సంబంధిత విభాగాల ఆచార్యులు పేర్కొంటున్నారు. గతంలో వీసీగా పనిచేసిన ఫిజిక్స్ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి సైన్స్ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వగా, ప్రస్తుతం వీసీగా ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కిషన్‌కుమార్‌రెడ్డి సైన్స్ కోర్సుల నిర్వహణకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. రద్దయిన కోర్సుల్లో ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ అప్లయిడ్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ మ్యాథ్స్ ఉన్నాయి. ఈ విషయమై క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ జి.వి. నర్సింహారెడ్డి స్పందిస్తూ.. బోధనా సిబ్బంది నియామకం జరిగితే ఆయా కోర్సులను పునరుద్ధరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News