రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!
ABN , Publish Date - Jun 25 , 2026 | 10:40 AM
కదులుతున్న రైళ్లపై రాళ్లతో దాడి చేసినా, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా ఇక ఇట్టే దొరికిపోతారు.
సికింద్రాబాద్ స్టేషన్ పరిధిలో సోలార్ సీసీ కెమెరాల నిఘా
ఆర్పీఎఫ్ పోలీన్‌స్టేషన్‌కు కెమెరాల అనుసంధానం
పట్టాల వెంట అనుమానాస్పదంగా ఉంటే గుర్తింపు
సికింద్రాబాద్: కదులుతున్న రైళ్లపై రాళ్లతో దాడి చేసినా, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా ఇక ఇట్టే దొరికిపోతారు. సికింద్రాబాద్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) పోలీసులు కొత్తగా సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏ చిన్న తప్పు చేసినా కెమెరాలో రికార్డువుతుంది. దాడులు చేసి పారిపోతే వెతికి మరీ పట్టుకొని శిక్షలు వేస్తారు.
ఎక్కడెక్కడంటే?
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మౌలాలి వరకు, సికింద్రాబాద్ నుంచి జేమ్స్ స్ట్రీట్ వరకు, సికింద్రాబాద్ నుంచి సీతాఫల్‌మండి స్టేషన్ వరకు ఈ సోలార్ సీసీ కెమెరాలను బిగించారు. ఈ సీసీ కెమెరాలను సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం చేసి ట్యాబ్, కంప్యూటర్లు, టీవీలో వీక్షించేలా ఏర్పాటు చేశారు.
మనిషి ఎటు కదిలితే అటు కెమెరా కదిలేలా..
విజువల్స్‌లో స్పష్టంగా కనిపించే విధంగా మెగా పిక్సల్స్ సీసీ కెమెరాలను ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఒక వేళ ఓ వ్యక్తి రైలు పట్టాల వద్ద నిలబడి ఉంటే వెంటనే సీసీ కెమెరా ఆ వ్యక్తివైపు తిరుగుతుంది. ముఖం కనిపించే విధంగా మనిషి బయటికి వెళ్లే వరకు కెమెరా అతని వైపే ఉంటుంది. ఆర్పీఎఫ్ పోలీసులు ట్యాబ్, కంప్యూటర్‌లో ఆ వ్యక్తి కదలికలను గమనిస్తుంటారు. ఒక వేళ ఫలాన దగ్గర వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉండి రైళ్లపై దాడికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తే విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు సమాచారం వెళుతుంది. వారు అక్కడి వెళ్లి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు.
దాడులు జరుగుతున్నందునే..
రైళ్లలో ప్రయాణికులు డోర్‌ల వద్ద నిలబడి సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. లేదంటే కిటికీల వద్ద కూర్చొని ఫోన్‌లతో కాలక్షేపం చేస్తుంటారు. ఈ సమయంలో కొందరు రైల్వే పట్టాల పక్కన నిలబడి కర్రలతో కదులుతున్న రైళ్లలోని ప్రయాణికులను కొడతారు. వారి చేతిలోని సెల్‌ఫోన్లు కింద పడగానే వాటిని తీసుకుని పారిపోతారు. ఇలా వరుస నేరాలు జరుగుతుండడంతో ఆర్పీఎఫ్ పోలీసులు సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News