అవమానాలను గెలిచిన ఆత్మవిశ్వాసం
ABN , Publish Date - Jun 25 , 2026 | 02:09 AM
సమాజం నిర్ణయించిన అందాల కొలతలకు సరిపోలేదని ఒక అమ్మాయిని అందరూ చిన్నచూపు చూశారు. తోటివారి వెటకారాలు, కన్నవారి నిరాదరణ మధ్య నలిగిపోయిన ఆమె...
సంకల్పం
సమాజం నిర్ణయించిన అందాల కొలతలకు సరిపోలేదని ఒక అమ్మాయిని అందరూ చిన్నచూపు చూశారు. తోటివారి వెటకారాలు, కన్నవారి నిరాదరణ మధ్య నలిగిపోయిన ఆమె... ఆత్మవిశ్వాసంతో సమాజపు మూసధోరణులను బద్దలుకొట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఆష్నా కుష్వాహా... తన జీవితంలో ఎదురైన చీకట్లను చీల్చు కుంటూ విజయతీరాలకు చేరిన స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
ఆష్నాకు లోకం అంటే ఏంటో తెలిసే లోపే అవమానాలు పరిచయమయ్యాయి. నాలుగున్నర అడుగుల ఎత్తున్న ఆష్నాకు చిన్నప్పడు తన పేరు వినే భాగ్యమే కలగలేదు. ‘చోటీ, ‘బౌనీ’ (పొట్టిది), ‘చుహియా’ (ఎలుక) వంటి అవమానకరమైన పిలుపులు ఆమె చిన్నతనంలో భాగమైపోయాయి. వీధిలోని పిల్లల నుంచి పాఠశాలలోని ఉపాధ్యాయుల వరకు అందరూ ఆమెను అలాగే పిలిచేవారు. ‘అందరూ నన్ను ఆయా పేర్లతో పిలవడం వల్ల ఒకానొక దశలో నా అసలు పేరు ‘ఆష్నా’ అనే విషయాన్ని నేనే మర్చిపోయాను’ అని గుర్తుచేసుకుంది. ముఖ్యంగా స్కూల్ అసెంబ్లీ అంటే ఆమెకు వణుకు. ఒకరోజు ఆలస్యంగా రావడంతో వెనుక వరుసలో నిలబడాల్సి వచ్చింది. ఆమె ఎత్తు తక్కువగా ఉండటంవల్ల ముందున్న పీటీ మాస్టర్ చేయిస్తున్న వ్యాయామాలు కనిపించక తప్పుగా చేసింది. దానికి ఆ మాస్టర్ అందరి ముందు ఆమె చెవి పట్టుకుని గట్టిగా పిండుతూ అవమానించాడు. చుట్టూ ఉన్న పిల్లల నవ్వులు ఆష్నా మనసులో ఎప్పటికీ మానని గాయాలుగా మిగిలిపోయాయి.
కన్నవారి కఠినత్వం
ఆష్నాకు 13 ఏళ్లు వచ్చేసరికి శారీరక ఎదుగుదల పూర్తిగా ఆగిపోయిందని బంధువులు తేల్చేశారు. ఆమెకు ‘డిజేబిలిటీ సర్టిఫికెట్’ ఇప్పించాలని కన్నవారికి సలహాలు ఇచ్చారు. ఈ బాడీషేమింగ్ వల్ల ఆష్నా చదువులో వెనకబడిపోయింది. దీంతో సమాజం ఆమెపై ‘నలాయక్’ (చేతకానిది) అని ముద్రవేసింది. ‘నువ్వు ఆకుకూరలు సరిగా తినకపోవడం వల్లే ఇలా పొట్టిగా ఉండిపోయావు’ అని కన్నతండ్రి కూడా నిందించడం ఆమెను మరింత కుంగదీసింది. 12వ తరగతికి వచ్చేసరికి ‘ఇలాంటి పిల్లకు మంచి సంబంధాలు రావు.. ఎక్కడైనా దొరికితే పొట్టివాడికి ఇచ్చి పెళ్లిచేసేయాలి’ అని ఇంట్లో నుంచే ఒత్తిడి మొదలైంది.
ఆరడుగుల బంధం...
ఇంట్లో ఊపిరాడనట్టు అనిపించడంతో ఆష్నా.. అందరినీ ఎదిరించి ధైర్యంగా ఇల్లు వదిలి ముంబై వచ్చింది. అక్కడ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరింది. అక్కడ ప్రతిష్ఠాత్మకమైన తాజ్‌హోటల్‌లో ఇంటర్న్‌షిప్ చేసే సమయంలో ఆమెకు ఆరడుగుల పొడవున్న ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఆయన భారత సైన్యంలో ఆఫీసర్‌గా సేవలు అందిస్తున్నారు. ఆరడుగుల పొడవున్న ఆ వ్యక్తికి ఆష్నా మనసు, ఆమెలోని స్వచ్ఛత ఎంతో నచ్చాయి. వారి మధ్య ప్రేమ చిగురించింది. ఎత్తుల మధ్య ఉన్న తేడాను చూసి ఆష్నాకు మొదట్లో అభద్రతాభావంగా అనిపించేది. దీంతో హైహీల్స్ వేసుకునేది. అయితే, ఆమె బాధను అర్థం చేసుకున్న ప్రియుడు ఒక రోజు ఆమెతో ‘నువ్వు హైహీల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఎత్తు నా గుండెల వరకు వస్తుంది. నువ్వు ఎప్పుడూ నా హృదయ స్పందనలు వింటూ ఉండు, మన జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది’ అని ధైర్యం చెప్పాడు. ఈ ఒక్క మాట ఆష్నా జీవితాన్ని మార్చేసింది.
వెలివేసిన కుటుంబం
వారి పెళ్లిని ఆష్నా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఒకానొక దశలో తండ్రి ఆమెను ఇల్లు వదిలి పొమ్మన్నాడు. 2016-17 మధ్య కన్నవారు ఆమెను పూర్తిగా వెలివేశారు. బంధువుల అభ్యంతరాలను, కుటుంబాల తిరస్కరణను పక్కనపెట్టి 2018, ఫిబ్రవరి 24న ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఇరుగుపొరుగు వారు వారిని చూసి నవ్వుకునేవారు. ‘అమితాబ్-జయాబచ్చన్ జోడీ’ అని వెటకారంగా కామెంట్లు చేసేవారు. పొట్టిగా ఉంటే పిల్లలు పుట్టరన్నారు. కానీ వాటిని తప్పని నిరూపిస్తూ ఒక అందమైన, ఆరోగ్యకరమైన అమ్మాయికి ఆష్నా జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఐదేళ్లు.

పరాభవం నుంచి పుట్టిన విజయం
కొన్నేళ్ల తర్వాత కన్నవారిపై ఉన్న ప్రేమతో కుమార్తెను తీసుకుని ఆష్నా పుట్టింటికి వెళ్లింది. కానీ అక్కడ ఆమెను, ఆమె కుమార్తెను అర్ధరాత్రివేళ కన్నవారే ఇంటి నుంచి వెళ్లగొట్టి హిమాచల్‌ప్రదేశ్ హైవేపై వదిలేశారు. ఆ ఘోర పరాభవం ఆమెను మానసిక క్షోభకు గురిచేసింది. కానీ, ఈసారి ఆమె కుంగిపోలేదు. తన జీవిత కథను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చెప్పడం ప్రారంభించింది. ఆమె రీల్స్, వీడియోలు లక్షలాదిమంది హృదయాలను తాకాయి. క్రమంగా ఆమె విజయవంతమైన డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో అవార్డులు అందుకుంది. సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడింది.
లోపాన్నే బలంగా...
బాడీషేమింగ్ వల్ల కుంగిపోతున్న లక్షలమంది యువతీయువకులకు నేడు ఆష్నా ఒక రోల్‌మోడల్‌గా మారింది. ‘మీరు పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా.. మీ శారీరక రూపం ఎప్పటికీ మీ గుర్తింపు కాదు. సమాజం లోపాలుగా చూసే విషయాలనే మనం బలాలుగా మార్చుకోవాలి’ అని ఆష్నా ఇచ్చే సందేశం నేటి తరానికి ఎంతో అవసరం. అవమానాల చీకట్లను దాటి ఆత్మవిశ్వాసపు ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన ఒక అపురూప స్ఫూర్తిగాధ ఆష్నా కుష్వాహా జీవితం.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!