సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
ABN , Publish Date - Jun 24 , 2026 | 08:00 PM
జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.
జనగామ, జూన్ 24: జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందగా, ఆ షాక్‌ను తట్టుకోలేక నాయనమ్మ కూడా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఏడాదిన్నర చిన్నారి రియాన్ ఇంట్లో ఆడుకుంటూ పెరట్లోని నీటి సంపు వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు సంపులో పడి చనిపోయింది. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు.
అప్పటి వరకూ నవ్వుతూ ఆడుకున్న చిన్నారి శవమై కనిపించడంతో నాయనమ్మ మారబోయిన నాగమ్మ (65) తట్టుకోలేకపోయింది. చిన్నారిని పట్టుకుని గుండెలవిసేలా ఏడుస్తూ తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైంది. ఆ బాధను భరించలేక ఆమెకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి చూసేలోపే నాగమ్మ కూడా ప్రాణాలు విడిచింది. పసికందుతో పాటు ఇంటి పెద్ద మరణించడంతో అంబేద్కర్ నగర్ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇవి కూడా చదవండి...
SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ నలుగురివి మాయమాటలు.. ప్రజలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And Telugu News