Share News

ఆ నలుగురివి మాయమాటలు.. ప్రజలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:20 PM

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

ఆ నలుగురివి మాయమాటలు.. ప్రజలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka

ఖమ్మం, జూన్ 24: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు(బుధవారం) వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఆనాడు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరలేదని గుర్తుచేశారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పది సంవత్సరాలలోనే కుంగిపోయిందని భట్టి విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీతో చెల్లిస్తోందన్నారు. తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు మాయమాటలతో రాష్ట్రంలో తిరుగుతున్నారని.. ప్రజలు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుతూ వచ్చామని తెలిపారు.


కోటి పది లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, నిరుపేదలకు 22 వేలకోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా కింద వేలకోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. మహిళల ఉచిత బస్సుకు 13వేల కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ‘సర్’ ప్రమాదకరమైందని అన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కు ఎంతో విలువైనదన్నారు. పోలింగ్ సిబ్బందికి సమగ్రమైన సమాచారం అందించాలన్నారు. జూన్ 30వ తేదీన మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాధపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.


రైతులను ఆదుకోవడంలో గత ప్రభుత్వం విఫలం: తుమ్మల

రెండున్నర సంవత్సరాల కాలంలో రైతు భరోసాకు 36 వేల కోట్ల రూపాయలు అందించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అవసరమైన ఎరువులను అందించామని చెప్పారు. ఈ నెల 30వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలన్నారు. రైతులను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాసు నాయక్, రాష్ట్ర కళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు నూత సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: వసంత కృష్ణప్రసాద్

SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 04:32 PM