ఖాకీలు.. షరా‘మామూలే’
ABN , Publish Date - Jun 25 , 2026 | 09:37 AM
హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో కొంతమంది పోలీసులను అవినీతి జబ్బు వీడడం లేదు.
పలు పోలీస్స్టేషన్ల సిబ్బందికి అవినీతి జబ్బు
4 నెలల్లో 6 పోలీస్‌స్టేషన్‌లపై ఏసీబీ దాడులు
లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న వైనం
పోలీస్ బాస్ హెచ్చరిస్తున్నా మారని తీరు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో కొంతమంది పోలీసులను అవినీతి జబ్బు వీడడం లేదు. స్టేషన్‌కు వచ్చేవారు బాధితులైనా, నేరం చేసిన వారైనా.. డబ్బులు ఇవ్వందే పోలీసులు ఏ పనీ చేయడం లేదు. ఇంకొంతమంది ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేసి మరీ దండుకుంటున్నారు. కావాలనే కేసులను తొక్కిపెట్టి, రేపు మాపు అంటూ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకొని డబ్బులు గుంజుతున్నారు. ఇలా వివిధ రకాల అవినీతి సిబ్బందితో పోలీస్ స్టేషన్‌లు అక్రమార్కులకు అడ్డాలుగా మారిపోయాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అన్నదమ్ముల గొడవలో ఒకరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై నరసింహ రూ. లక్ష లంచం డిమాండ్ చేసి ఒప్పందంలో భాగంగా రూ. 50వేలు తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో పోలీసుల అవినీతిపై మరోమారు చర్చనీయాంశమైంది.
డీజీపీ హెచ్చరిస్తున్నా..
ఇటీవల పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీసులు అవినీతి అక్రమాలకు పాల్పడినా, క్రిమినల్స్‌తో దోస్తీ కట్టినా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. స్వయంగా ఆయన రంగంలోకి ఎస్సై నుంచి ఎస్పీ, సీపీల వరకు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టి క్లాస్ తీసుకుంటున్నారు. అయినా కొంతమంది సిబ్బంది తమకేమీ పట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి కాసులు దండుకుంటున్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఆరు పోలీస్స్టేషన్ల సిబ్బందిపై ఏసీబీ దాడులు చేయగా అవినీతి సొమ్ముతో పట్టుబడ్డారు. కొంతమంది అవినీతి అధికారుల వల్ల డిపార్టుమెంట్‌కు చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అవినీతి జబ్బుకు చికిత్స చేస్తేనే పోలీస్‌స్టేషన్‌లలో బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని పలువురు కోరుతున్నారు.
రూ. 4లక్షలతో చిక్కిన సైబర్ క్రైమ్ సీఐ
ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుల నుంచి రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఒక ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. సైబర్ క్రైమ్ కేసులో కుటుంబ సభ్యులు, స్నేహితులను ఇరికించకుండా ఉండేందుకు రూ. 9 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్ అప్పటికే రూ. 5లక్షలు తీసుకున్నాడు. మరో రూ. 4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు.
రూ. లక్షతో సైబర్ క్రైమ్ ఎస్సైలు
ఎల్‌బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఏఆర్ ఎస్సైలు నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసి రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు.
రూ.30 వేలతో మహిళా ఎస్సై..
ఒక నేరస్థుడి నుంచి బోయిన్‌పల్లి మహిళా ఎస్సై రూ. 30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తండ్రిపై దాడి చేసి జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చిన నిందితుడికి ప్రతీ సోమవారం స్టేషన్‌కు హాజరయ్యే విషయంలో ఉపశమనం కలిగిస్తానని చెప్పి రైటర్ రూ.పదివేలు, ఎస్‌ఐ రూ. 30వేలు డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిపోయారు.
రూ.2లక్షలతో సీఐ, ఎస్సై..
నకిలీ ధ్రువపత్రాల కేసులో లంచం డిమాండ్ చేసిన ఆర్జీఐ ఎయిర్ట్ పోర్టు ఇన్‌స్పెక్టర్, ఎస్సైని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేసి రూ. 2లక్షలు అడ్వాన్స్ తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.
రూ.15వేలతో ఏఎస్సై..
ఓ కేసు విషయంలో లంచం డిమాండ్ చేసిన చైతన్యపురి ఏఎస్సై రంగారెడ్డి కోర్టులో రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం
Read Latest AP News And Telangana News And International News And Telugu News