నంద్యాలలో ఫకీరు వేషంలో దొంగతనం..
ABN , Publish Date - Jun 25 , 2026 | 09:05 AM
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌరదిన్నె గ్రామంలో ఫకీరు వేషంలో వచ్చిన ఓ దుండగుడు మహిళను మోసం చేసి రూ.50 వేల నగదును అపహరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నంద్యాల జిల్లా, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌరదిన్నె గ్రామంలో ఫకీరు వేషంలో వచ్చిన ఓ దుండగుడు మహిళను మోసం చేసి రూ.50 వేల నగదును అపహరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూజల పేరుతో నమ్మకం కల్పించి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరదిన్నె గ్రామానికి చెందిన కాశింభీ అనే మహిళ ఇంటికి ఫకీరు వేషంలో ఓ వ్యక్తి వచ్చాడు. ఆమె కుటుంబం కొన్ని సమస్యలు, బాధల్లో ఉందని చెప్పి పూజలు చేస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయని నమ్మించాడు. తన మాటలతో మహిళను నమ్మించిన దుండగుడు ప్రత్యేక పూజలు చేయాలని తెలిపాడు. పూజలకు అవసరమైన సామగ్రి తీసుకురావాలని చెప్పడంతో కాశింభీ సమీపంలోని అంగడికి వెళ్లింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఫకీరు ఇంట్లోకి ప్రవేశించి నగదు కోసం వెతికాడు.
ఇంట్లో భద్రపరిచిన రూ.50 వేల నగదును అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కాశింభీ నగదు కనిపించకపోవడంతో షాక్‌కు గురైంది. ఫకీరు కూడా అక్కడ లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అనంతరం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గ్రామ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫకీరు వేషంలో తిరుగుతూ ప్రజలను మోసం చేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో సౌరదిన్నె గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిచితుల మాటలను నమ్మి ఇంట్లోకి అనుమతించవద్దని, నగదు, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News