బస్సు అనుకున్నారా, విమానం అనుకున్నారా..?
ABN , Publish Date - Jun 25 , 2026 | 07:56 AM
చాలా మందికి నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలు అనే తేడా లేకుండా నాశనం చేస్తుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా బస్సు, రైలు ప్రయాణాల్లో కనిపిస్తుంటారు. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలు అనే తేడా లేకుండా నాశనం చేస్తుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా బస్సు, రైలు ప్రయాణాల్లో కనిపిస్తుంటారు. ఆహార పదార్థాలను తినేసి, వ్యర్థాలను సీటు చుట్టుపక్కల పడేస్తుంటారు. ఇది చూసిన మిగతా వారికి చిర్రెత్తుకొస్తుంది. కనీసం నలుగురిలో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అనుకుని లోలోపల తిట్టుకుంటుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, అది బస్సో, రైలో కాదండోయ్.. ఏకంగా విమానంలో జరిగింది. ప్రయాణికుల ప్రవర్తనకు విసిరిపోయిన ఓ మహిళా సిబ్బంది దాన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
ఎయిర్ ఇండియా ఉద్యోగిని వంశిక కటారియా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. విమానం క్యాబిన్ అంతా ప్రయాణికులు చెత్తతో నింపేశారు. తమ సీట్ల చుట్టూ తినేసిన చిప్స్ ప్యాకెట్లు, టిష్యూలు, టీ కప్పులు, ఇతర వ్యర్థాలను చెల్లాచెదురుగా పడేశారు. దీన్ని వీడియో తీసిన కటారియా.. ప్రయాణికుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వీడియోలో 'ప్రియమైన ప్రయాణికులారా, మీరు విమాన టికెట్టును కొనుగోలు చేయగలిగినప్పుడు, కొన్ని ప్రాథమిక మర్యాదలను కూడా పాటించగలరు' అనే సందేశాన్ని ఆమె రాసుకొచ్చారు. ఈ అంశంపై పలువురు నెటిజన్లు ఆమెకు అనుకూలంగా స్పందించారు. అయితే, వారికి వివరణ ఇస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశ్యం కాదన్నారు కటారియా. ప్రయాణికుల చిన్న ప్రయత్నం కూడా గణనీయమైన మార్పును తీసుకురాగలదని పేర్కొన్నారు.
టీ కప్పులు, స్నాక్ ప్యాకెట్లు, టిష్యూలు వంటి వ్యర్థాలను చెత్త సేకరణ సమయంలో క్యాబిన్ సిబ్బందికి అందజేయాలని ఆశిస్తున్నట్లు కటారియా చెప్పుకొచ్చారు. దీంతో విమానం శుభ్రం చేసే వారికి పని భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రయాణికుల ప్రవర్తన చర్చకు దారి తీసింది.
ఈ వార్తలు కూడా చదవండి
80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..
పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..