Share News

80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..

ABN , Publish Date - Jun 24 , 2026 | 08:23 PM

80 ఏళ్ల ఓ వృద్ధ కళాకారుడి కష్టాలు చూసి ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. ఆ కళాకారుడికి ఆర్థిక సాయం చేయడానికి పూనుకున్నారు.

80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..
Kolkata Violinist

ఇంటర్‌నెట్ డెస్క్: దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తన దృష్టికి వచ్చిన విషయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. అవసరం ఉన్న వారికి సాయం చేస్తుంటారు. తాజాగా, 80 ఏళ్ల ఓ వృద్ధ కళాకారుడి కష్టాలు చూసి ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. ఆ కళాకారుడికి ఆర్థిక సాయం చేయడానికి పూనుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాకు చెందిన 80 ఏళ్ల భగవాన్ మల్లిక్ అనే కళాకారుడు దాదాపు 40 ఏళ్ల నుంచి వాయిలిన్ వాయిస్తున్నారు.


ఆయన తన భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. భగవాన్ ఫుట్‌పాత్‌పై వాయిలిన్ వాయించగా వచ్చిన డబ్బులతోటే భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. భగవాన్ కొన్ని గంటల పాటు వాయిలిన్ వాయిస్తే 100 రూపాయలు వస్తుంది. ఇంటి ఖర్చులకు, ఇతర అవసరాలకు ఆ డబ్బులు సరిపోక వారు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఆరాధన అనే యువతి భగవాన్ కష్టాలను తెలుసుకుంది. ఆయన కష్టాలను వివరిస్తూ వీడియోలు చిత్రీకరించింది. అంతేకాదు.. తన వంతుగా లక్ష రూపాయలు ఆయనకు సాయం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర దృష్టికి కూడా వెళ్లాయి. భగవాన్ వీడియోలు చూసి ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. 80 ఏళ్ల ఆ వృద్ధ కళాకారుడికి సాయం చేయడానికి పూనుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘చాలా మంది లాగే నేను కూడా సాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఆయన వివరాలు సరిగా లేవు’ అని రాసుకొచ్చారు. ఆయన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భగవాన్ వివరాలు తెలుసుకుని ఆనంద్ మహీంద్ర సాయం చేసే అవకాశం కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 24 , 2026 | 08:29 PM