మాయంమశ్చీంద్ర.. జేఎన్‌టీయూలో సర్టిఫికెట్ల అదృశ్యం
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:44 AM
జేఎన్‌టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
2016లో నుంచి తొక్కిపెడుతున్న వైనం
మిస్సింగ్ కాదు.. రూ.కోట్లకు అమ్మేశారు
విచారణ నివేదికలో కీలక అధికారి పేరు
చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారా..?
అనంతపురం: జేఎన్‌టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. జేఎన్‌టీయూ పరీక్షల విభాగానికి 2016లో చేరిన ఓడీ, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు మాయమయ్యాయి. ఇవి ఎలా మిస్ అయ్యాయి, ఎక్కడికి వెళ్లాయి, దీని వెనుక కుట్ర ఉందా..? నిర్లక్ష్యం జరిగిందా..? అని నిగ్గు తేల్చాల్సిన అధికారులు పట్టించుకోవడం మానేశారు. సర్టిఫికెట్ల మాయం వెనుక కీలక అధికారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
చిన్నస్థాయి ఉద్యోగులు చిన్నచిన్న పొరపాట్లు చేసినా కఠినంగా వ్యవహరించే అధికారులు, ఇంత పెద్ద మాయాజాలం వెనుక ఓ పెద్ద అధికారి ఉన్నారని తెలిసినా పట్టించుకోవడం లేదు. సర్టిఫికెట్ల మాయం వెనుక ఉన్నదెవరో కమిటీ నివేదికలో తేల్చినా మిన్నకుండిపోతున్నారు. సర్టిఫికెట్లు రిసీవ్ చేసుకున్నట్లు సంతకాలు చేశారని, డబ్బులు చెల్లించారని రాష్ట్ర ఆడిట్ శాఖ సైతం నిర్ధారించింది. అయినా మిస్సింగ్ అని చెప్పారని నివేదిక పేర్కొంది. అన్నీ తెలిసినా మౌనంగా ఉండటం వెనుక ఆ కీలక అధికారి రాజకీయ పలుకుబడి, ధన బలమే కారణమని అంటున్నారు.
రూ.50 కోట్ల కుంభకోణం..?
2016 నుంచి ఇప్పటి వరకూ సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని చిన్న సమస్యగా చూపుతున్నారు. ఈ కుంభకోణాన్ని బయటికి పొక్కనీకుండా తొక్కిపెడుతున్నారు. మిస్సింగ్ అయిన సర్టిఫికెట్ల వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయని అంటున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌ను రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు అమ్ముకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ కీలక అధికారితో పాటు మరో ఇద్దరు అధికారులు ఈ భారీ కుంభకోణంలో పాలుపంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇది కనీసం రూ.50 కోట్ల కుంభకోణం అని అంటున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని, అందుకే వర్శిటీ అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని సమాచారం.
పొరుగు రాష్ట్రాల్లో చలామణి..?
జేఎన్‌టీయూలో మాయమైన సర్టిఫికెట్లు పొరుగు రాష్ట్రాల్లో చలామణీలో ఉన్నాయని సమాచారం. వచ్చిన రెండు మూడు వారాల్లోనే ఆ సర్టిఫికెట్లను రాష్ర్టాలు దాటించారని వర్శిటీ వర్గాలు అంటున్నాయి. పక్కా ప్రణాళికతో హైదరాబాద్, కేరళ, తమిళనాడుకు తరలించి విక్రయించారని అంటున్నారు. అవి నకిలీలకు చేతికి వెళ్లాయని, బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ ప్రొవిజనల్స్‌గా మార్చుకుని, అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారని సమాచారం. కొందరు అధికారులు మిస్సింగ్ అయిన సీరియల్ నంబర్ల ఆధారంగా విచారణ చేసినట్లు సమాచారం. ఆ సీరియల్ నంబర్లతో ఉన్న సర్టిఫికెట్లు వినియోగించి కేరళ, తమిళనాడు, తెలంగాణలో పలువురు ఉద్యోగాలు పొందారని అంటున్నారు.
తప్పించేందుకు ప్రయత్నాలు
జేఎన్‌టీయూలోని పలు విభాగాలలో పనిచేసిన ఆ కీలక అధికారికి వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, అప్పటి అధికారుల అండదండలు ఉండేవి. దీంతో చర్యల నుంచి తప్పించుకున్నారు. ప్రభుత్వం మారినా, ఇప్పటికీ కొందరు అధికారులు ఆయనపై ఈగ వాలకుండా చూస్తున్నారని సమాచారం. అన్ని విభాగాల్లో ఆ కీలక అధికారి మనుషులు ఉన్నారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఆయనకు ఉన్నాయని, అందుకే అవినీతి, అక్రమ వ్యవహారాల నుంచి బయటపడుతున్నారని సమాచారం. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఆ కీలక అధికారిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్ వేధింపులు..
రాజకీయాల కోసం మత్స్యకారులను రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు:
Read Latest AP News And Telangana News And International News And Telugu News