Share News

ఫుట్‌బాల్ మాయలో పడిపోయా.. ఫిఫా వరల్డ్ కప్‌పై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jul 14 , 2026 | 10:50 AM

ఫిఫా ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. ఫిఫా మాయలో సమయం తెలియకుండా పోతోందని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫుట్‌బాల్ మాయలో పడిపోయా.. ఫిఫా వరల్డ్ కప్‌పై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Amitabh Bachchan

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. ఫిఫా మాయలో సమయం తెలియకుండా పోతోందని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫుట్‌బాల్‌ టోర్నమెంట్ టైమింగ్స్ వల్ల తన నిద్ర, రోజువారీ పనులు తలకిందులైనప్పటికీ, మ్యాచ్‌లు ఇస్తున్న కిక్ ముందు అవేవీ పెద్ద సమస్య కాదని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 హడావుడి సామాన్యులనే కాకుండా సెలబ్రిటీలను కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ ఈ మెగా టోర్నమెంట్‌కు వీరాభిమానిగా మారిపోయినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి, తెల్లవారుజామున జరిగే ఈ మ్యాచ్‌ల వల్ల తన దినచర్య పూర్తిగా తలకిందులైందని ఆయన తన తాజా బ్లాగ్‌లో రాసుకొచ్చారు. సమయం తెలియకుండా పోతున్నప్పటికీ ఈ ఆటను చూడటం, తమకు నచ్చిన జట్లను ప్రోత్సహించడం, పరాజయాల వేళ బాధపడటం ఒక గొప్ప అనుభూతిని ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ టోర్నమెంట్‌లో ఎవరూ ఊహించని అండర్‌డాగ్స్ అద్భుతమైన ప్రదర్శనతో దిగ్గజ జట్లకు చుక్కలు చూపించడం అమితాబ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఫుట్‌బాల్ దిగ్గజాలు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంటే.. అనామక జట్లు పోరాట పటిమతో గుర్తింపు సాధించడం తనను సంతోషపెట్టిందని బిగ్‌బీ పేర్కొన్నారు. క్లబ్ మ్యాచ్‌ల సమయంలో ఒకరితో ఒకరు తలపడే క్రీడాకారులు, దేశం కోసం ఆడేటప్పుడు మాత్రం విభేదాలు పక్కనబెట్టి ఒక్కటవుతున్నారు. దీనిని మన ఐపీఎల్ (IPL) క్రీడాకారుల ప్రయాణంతో ఆయన పోల్చారు. విభిన్న ఫ్రాంచైజీల తరఫున ఆడిన ఆటగాళ్లు జాతీయ జట్టు కోసం ఏకమవ్వడం అనేది ఒక అద్భుతమైన వ్యక్తిత్వానికి నిదర్శనమని అమితాబ్ కొనియాడారు.


ముఖ్యంగా.. కేవలం 17, 18 ఏళ్ల వయసున్న టీనేజర్లు దేశం తరఫున ఆడుతూ కోట్లాది మంది ఆశలను మోయడాన్ని చూసి అమితాబ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఆ వయసులో మనం ఏం చేస్తున్నాం?’ అని ప్రశ్నించుకుంటే, తాము ఇప్పటి తరం యువతలా అస్సలు ఉండేవారం కాదనిపించింది. ప్రతి తరానికి ఒక ప్రత్యేకత ఉంటుందని, నేటి తరం పొందుతున్న అవకాశాలు, సాంకేతిక ప్రగతి ఎంతో గొప్పవని చెప్తూ.. యువత రాబోయే భవిష్యత్తును చూడటం తనకు ఎంతో తృప్తిని ఇస్తుంది’ అని ఆశాభావం వ్యక్తం చేస్తూ బచ్చన్ తన బ్లాగ్‌ను ముగించారు. ప్రస్తుతం అమితాబ్ ప్రస్తుతం 'కల్కి 2898 AD' సీక్వెల్ అయిన తన రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి

దొంగతనం చేశారనే అనుమానంతో కరెంట్ షాక్.. వీడియో వైరల్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్..

Updated Date - Jul 14 , 2026 | 12:23 PM