దొంగతనం చేశారనే అనుమానంతో కరెంట్ షాక్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 14 , 2026 | 07:39 AM
మధ్యప్రదేశ్‌లో వాహనం దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు యువకులను స్తంభానికి కట్టేసి, కరెంట్ షాక్‌లు ఇస్తూ అమానుషంగా హింసించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మోడియా గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మోటారు వాహనం దొంగిలించారనే అనుమానంతో ధనియాఖేడి గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులను స్థానికులు పొలంలోని స్తంభానికి కట్టేశారు. అడవి జంతువుల నుంచి పంటలను రక్షించడానికి వాడే విద్యుత్ పరికరాన్ని ఉపయోగించి వారిని దారుణంగా కొట్టారు. అంతేకాదు.. కరెంట్ షాక్‌లు ఇస్తూ దొంగతనాన్ని ఒప్పుకోవాలంటూ అమానుషంగా చిత్రహింసలకు గురిచేశారు. శనివారం సాయంత్రం ఈ దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రూరమైన ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా స్పందించి రంగంలోకి దిగింది.
ఈ వీడియో ఆధారంగా పోలీసులు తక్షణమే స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితులపై దాడికి పాల్పడిన ఇద్దరు అనుమానితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులను గుర్తించి పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, బాధితులైన ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు దొంగిలిస్తున్నట్లు తేలడంతో, జులై 4వ తేదీనే వారిపై కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్‌డీపీఓ ప్రతిభా శర్మ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ అణు అంశంపై దౌత్యానికే ట్రంప్ ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు
ఉదయం షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి