తెలుగు రాష్ట్రాల్లో నేత్రపర్వంగా వినాయక చవితి వేడుకలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 09:22 AM
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, అమరావతి, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇళ్లల్లోనూ గణేశుడి చిన్న విగ్రహాలను తీసుకువచ్చి పూజలు చేస్తున్నారు. పూజకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలకే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయాలకు భక్తులు వెళ్లి స్వామివారని దర్శించుకుంటున్నారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.
ఖైరతాబాద్ మహాగణేశుడికి ఉదయం11 గంటలకు తొలిపూజ..
ఖైరతాబాద్ మహాగణేశుడికి తొలిపూజను ఉదయం11 గంటలకు నిర్వహించనున్నారు. తొలిపూజలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా పాల్గొననున్నారు. పంచముఖ సంకటహర మహా గణపతిగా స్వామివారు దర్శనమివ్వనున్నారు. 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడిని నిర్వాహకులు తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు.
గాజువాకలో గాజుల గణపతి..
విశాఖపట్నం గాజువాకలోని గాజుల గణపతి వేడుకలను శ్రీ సమతానంద దుర్గ మహా పీఠాధిపతి శ్రీ శ్రవణ చైతన్యానంద చిన్న స్వామీజీ ప్రారంభించారు. హిందువుల తొలి పండుగ వినాయక చవితిని పురస్కరించుకుని గాజువాకలో గత 15 సంవత్సరాలుగా వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. మహిళల సౌభాగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గాజులతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించామని వెల్లడించారు. అనకాపల్లికి చెందిన కళాకారుడు ఆరిపాక కృష్ణ బృందం గత నెల రోజులుగా కష్టపడి ఏకదంతుడి విగ్రహాన్ని తయారుచేశారని నిర్వాహకులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల సందడి..
సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్ మండలం రేజింతల్‌లోని సిద్ధి వినాయక ఆలయంలో గణపతిని దర్శించుకోవడానికి భక్తులు బారులు దీరారు. స్వామివారిని దర్శించుకోవడానికి గంటకు పైగా సమయం పడుతోంది. అలాగే, పటాన్‌చెరు మండలం రుద్రారంలోని సిద్ధిగణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 62 అడుగుల బాల గణపతి..
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు రెల్లివీధిలో 62 అడుగుల బాల గణపతిని తీర్చిదిద్దారు. గణేశ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 62 అడుగుల బాల గణపతికి డీజే పాటలు లైటింగ్, ఫైర్ క్రాకర్స్, స్మోక్, హారతితో వినాయక చవితి ఉత్సవాలను మొదలు పెట్టారు. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో యువత, పట్టణ సీఐ రజిని కుమార్ పాల్గొన్నారు. గణేశ్ విగ్రహా తయారీలో పర్యావరణ పరిరక్షిణ కోసం మట్టి, పీచు, ఐరన్, సర్వే కర్రలు, వాటర్ పెయింట్స్‌నే వినియోగించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోశయ్య దూరదృష్టితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్: సీఎం రేవంత్‌రెడ్డి
ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్
మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News