ఆ ఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:44 PM
కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ జిల్లా, జులై 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా, సంబంధిత వ్యక్తుల భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెడతాయని పేర్కొన్నారు.
గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతాల్లో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ రెండు ఘటనలపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సున్నితమైన ప్రాంతాలు గుర్తించి అవగాహన సదస్సులు నిర్వహించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
మూలపేటలో రాకేశ్ అనే యువకుడు మృతి
కాగా, కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఓ వ్యక్తితో కొంతమంది యువకులకు గొడవ జరిగింది. ఈ ఘటనలో పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన రాకేశ్ (25) అనే యువకుడు మృతిచెందాడు. తన అమ్మమ్మ వేమగిరి రమణమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం మూలపేటకు రాకేశ్ వచ్చాడు. ఈ సందర్భంగా రాకేశ్ చెల్లి గ్రామంలోని ఓ దుకాణం వద్దకు వెళ్లగా, స్థానికంగా ఉన్న ఐదుగురు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించారు. ఈ క్రమంలో తన అన్న రాకేశ్.. ఐదుగురు యువకులను మందలించాడు. వీరిలో వంశీ అనే యువకుడు కోపంతో రాకేశ్‌ను చాకుతో పొడవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
గొల్లప్రోలులో మాజీ కౌన్సిలర్ సంధ్యా భర్త లింగం అర్జునుడు మృతి..
గొల్లప్రోలు నగర పంచాయతీ రెండో వార్డు మాజీ కౌన్సిలర్ సంధ్యా భర్త లింగం అర్జునుడు, తన స్నేహితులతో కలిసి దారపల్లి వాటర్ ఫాల్స్‌కు విహారయాత్రకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక నివాసి బచ్చల మారుతి పవన్ కల్యాణ్ అనే వ్యక్తితో అర్జునుడికి మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అర్జునుడి కడుపులో బచ్చల మారుతి పవన్ కల్యాణ్ బలంగా పొడిచాడు. కత్తిపోట్లకు గురైన అర్జునుడు తీవ్ర రక్తస్రావం కావడంతో పిఠాపురంలోని కార్తికేయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అర్జునుడు మృతిచెందాడు. ఈ రెండు ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News