తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:41 PM
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఢిల్లీ, జులై 15 (ఆంధ్రజ్యోతి): అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్ర పౌర విమానమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పష్టం చేశారు. అతి త్వరలోనే ఈ ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక వస్తోందని పేర్కొన్నారు. త్వరగా నివేదిక ఇవ్వడం కంటే.. ప్రమాదం అసలు నిజాన్ని బయటపెట్టడమే తమకు ముఖ్యమని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గతేడాది జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా AI-171 బోయింగ్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు భూమిపై ఉన్న 19 మంది.. మొత్తం 260 మంది మృతిచెందారు. ఈ ఘటనలో విమాన వ్యవస్థలు, బ్లాక్ బాక్స్ డేటా, ఇంజిన్ భాగాల విశ్లేషణలో AAIB కీలక పురోగతి సాధించింది. పౌర విమానయాన శాఖకు ఐదు ప్రధాన డిమాండ్లతో బాధితుల కుటుంబ సభ్యులు లేఖలు రాశారు. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ముందు స్వతంత్ర 'ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్ వాలిడేషన్ టెస్టులు' నిర్వహించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు పురోగతిపై ప్రతి 15 లేదా 30 రోజులకు ఒకసారి కుటుంబాలకు అధికారికంగా సమాచారం అందించాలని అధికారులకు కేంద్రమంత్రి సూచించారు.
ఈ కేసు విచారణ బృందంలో బోయింగ్ 787 నడిపిన అనుభవం ఉన్న సీనియర్ కమర్షియల్ పైలట్‌ను చేర్చాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు చట్టపరమైన హక్కులను కోల్పోయేలా బాధితులపై ఎలాంటి బలవంతపు ఒప్పందాల సంతకాలు చేయించవద్దని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై తుది నివేదిక విడుదలకు ఓ కచ్చితమైన కాలపరిమితిని ప్రకటించాలని కుటుంబ సభ్యులు కోరారు. బాధితుల కుటుంబ సభ్యుల లేఖపై కేంద్రమంత్రి స్పందించారు. అంతర్జాతీయ దర్యాప్తు నిబంధనల ప్రకారమే విచారణ వేగంగా సాగుతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉడాన్ పథకం మరో పదేళ్లు పొడిగిస్తున్నాం: రామ్మోహన్
రాయలసీమను జగన్ ముంచేశారు.. సోమిరెడ్డి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News