సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:34 PM
సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు జరపడానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా., జులై 11 (ఆంధ్రజ్యోతి): సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (AP Minister Narayana) పేర్కొన్నారు. ఈ ఎన్నికలు జరపడానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఈరోజు (శనివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో మంత్రి నారాయణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి నారాయణ వెంట ఎమ్మెల్యే నాయకర్, ప్రజాప్రతినిధులు,అధికారులు ఉన్నారు. అనంతరం నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాలకు సుమారుగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. గత పుష్కరాలకు నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారని పేర్కొన్నారు.
రూ.150 కోట్లు మంజూరు చేశాం..
ఇప్పటివరకు మున్సిపల్ శాఖకు పుష్కర అభివృద్ధి పనుల నిమిత్తం రూ.150 కోట్లు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. త్వరలో శాఖల వారీగా పుష్కర నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. నిధులు లేకపోయినా తమ ప్రభుత్వం పుష్కరాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు రూ.1400 కోట్లు యుసీఎఫ్ నిధులు మంజూరు చేశామని వివరించారు. పుష్కరాల నాటికి రోడ్లు, డ్రైన్‌లు, పార్కులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నర్సాపురం మున్సిపాలిటీకి రూ.34 కోట్లు కేటాయించామని ప్రస్తావించారు.
ఆ పనులకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం..
కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఏపీకి కేంద్రం రూ.14,000 కోట్లు UCF నిధులు కేటాయించిందని వెల్లడించారు. మరో రూ.16 కోట్లు సీఎం కేటాయించారని అన్నారు. ఈ నిధులతో ఏయే ప్రాజెక్టులు చేపట్టాలనే దానిపై డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అమృత్ 2.0 ద్వారా రూ.125 కోట్లతో డ్రింకింగ్ వాటర్ పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పట్టణంలో రెండు ఎస్‌టీపీలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిధులతో నిర్మిస్తున్నామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. అయినా సీఎం చంద్రబాబు కేంద్ర సహకారంతో అభివృద్ధి పనుల కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News