Share News

భోగాపురం.. ప్రయాణం సుఖమయం!

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:08 AM

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ‘రెక్కలు’ విచ్చుకొనే సమయం ఆసన్నమైంది. ఈ నూతన ఎయిర్‌పోర్టు ద్వారా ప్రపంచ దేశాలతో అనుసంధానం పెరగనుంది.

భోగాపురం.. ప్రయాణం సుఖమయం!
Bogapuram International Airport

  • విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు

  • ‘కనెక్టింగ్‌’ కోసం హైదరాబాద్‌, చెన్నై

  • వంటి ఇతర నగరాలకు వెళ్లక్కర్లేదు

  • వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతికీ ఊతం

  • లాజిస్టిక్స్‌ హబ్‌గా మారనున్న ఉత్తరాంధ్ర

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ‘రెక్కలు’ విచ్చుకొనే సమయం ఆసన్నమైంది. ఈ నూతన ఎయిర్‌పోర్టు ద్వారా ప్రపంచ దేశాలతో అనుసంధానం పెరగనుంది. విదేశాలకు వెళ్లాలంటే ఇకపై కనెక్టింగ్‌ విమానాల కోసం హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీ వెళ్లక్కర్లేదు. దేశంలోని ఇతర నగరాలకు కనెక్టివిటీ మెరుగుకానుంది. ఔషధాలు, ఆక్వా ఉత్పత్తులు, రెడీమేడ్‌ దుస్తులు తదితర ఉత్పత్తులను ‘భోగాపురం’ నుంచే విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. తద్వారా ఉత్తరాంధ్ర లాజిస్టిక్స్‌ హబ్‌గా మారనుంది. ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి.


విశాఖ ఎయిర్‌పోర్టులో అనేక ఆంక్షలు

రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. అయితే ఇవి పేరుకే ‘అంతర్జాతీయం’ గానీ ఇతర దేశాలకు వెళ్లేందుకు తగినన్ని విమాన సర్వీసులు లేవు. ముఖ్యంగా విశాఖపట్నం విమానాశ్రయంలో విమాన సేవలు పరిమితంగానే ఉంటాయి. ఈ ఎయిర్‌పోర్టు నేవీ అధీనంలో ఉండడంతో రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు మూసివేస్తారు. విదేశీ విమానాలు ఎక్కువగా రాత్రి 10 గంటల తర్వాత వచ్చి, తెల్లవారుజామునే బయలుదేరి వెళతాయి. ఈ కారణంగా విశాఖ నుంచి విదేశాలకు ఎక్కువ విమానాలు లేవు. గతంలో సింగపూర్‌, మలేషియా, బ్యాంకాక్‌, శ్రీలంక, దుబాయ్‌లకు విమానాలు నడిచాయి. నేవీ ఆంక్షల కారణంగా, తగిన డిమాండ్‌ లేదని విమాన సంస్థలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు సింగపూర్‌ విమానం ఒక్కటే నడుస్తోంది. విమాన సంస్థలు కోరిన సమయంలో అధికారులు స్లాట్లు ఇవ్వకపోవడం వల్ల చాలా విమాన సంస్థలు విశాఖపట్నం రావడం లేదు. ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు కూడా పరిమితంగానే విమానాలు నడుస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే విమాన సంస్థలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.


విదేశాలకు ఎగుమతులు

ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్టులో ఔషధాలు, ఆక్వా, రెడీమేడ్‌ దుస్తులు వంటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన సదుపాయాలు లేవు. ప్రత్యేక టెంపరేచర్‌ కంట్రోల్‌ రూమ్‌లు, విమానాల్లోకి సరుకును ఎక్కించడానికి ప్రత్యేకమైన లిఫ్ట్‌లు లేని కారణంగా కొద్ది పరిమాణంలో మాత్రమే ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్టు అవుతున్నాయి. విశాఖపట్నంలో రెండు పోర్టులు, ఒక స్టీల్‌ ప్లాంట్‌తోపాటు వందల సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. విశాఖపట్నం ఎకనమిక్‌ జోన్‌, అచ్యుతాపురంలో ఏపీ ఎకనమిక్‌ జోన్‌ ఉత్పత్తులన్నీ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. మరోవైపు రెడీమేడ్‌ దుస్తులు తయారు చేసే బ్రాండిక్స్‌ కర్మాగారం కూడా ఉంది. అటు ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆక్వా పరిశ్రమల నుంచి వనామీ రొయ్యలు, విశాఖ నుంచి టూనా చేపలను విదేశాలకు పంపించే సీఫుడ్‌ ఎక్స్‌పోర్టు సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను రోడ్డు మార్గాన హైదరాబాద్‌, చెన్నై పంపించి, అక్కడి నుంచి విమానాల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో తగిన అనుమతులు తీసుకుని, లాజిస్టిక్స్‌ సదుపాయాలు కల్పించడం ద్వారా భోగాపురం నుంచే ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి కానున్నాయి.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 07:08 AM