విశాఖ రైల్వే స్టేషన్‌లో ఘనంగా ‘స్టేషన్ మహోత్సవ్ 2026’
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:19 PM
విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆవిర్భవించి 130 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈరోజు (సోమవారం) ‘స్టేషన్ మహోత్సవ్’ నిర్వహించారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 28: విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆవిర్భవించి 130 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈరోజు (సోమవారం) ‘స్టేషన్ మహోత్సవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ విచ్చేశారు. అలాగే విశాఖ డివిజన్ డీఆర్ఎమ్ లలిత్ బోహ్రాతో పాటు పలువురు రైల్వే అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది రైల్వే స్టేషన్‌లో ఫ్లాగ్ మార్చ్ చేశారు.
స్టేషన్ మహోత్సవ్‌లో భాగంగా వాల్తేరు డివిజన్, విశాఖ స్టేషన్ చరిత్రను తెలిపే అరుదైన ఫోటో ఎగ్జిబిషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. రైల్వే వారసత్వాన్ని వివరించే వస్తువులను ప్రదర్శించారు. దశాబ్దాలుగా విశాఖ స్టేషన్ రూపాంతరం, మైలురాళ్లు, చారిత్రక కథనాలను పొందు పరుస్తూ ఓ కాఫీ టేబుల్ బుక్‌ను రూపొందించారు. దీన్ని సందీప్ మాధుర్, లలిత్ బోహ్రా ఆవిష్కరించారు. ఆ తరువాత విశాఖ రైల్వే స్టేషన్ 130 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసేలా సిబ్బంది హీలియం బెలూన్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే రైల్వే చరిత్ర, విశిష్టతను చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
విశాఖ రైల్వే స్టేషన్‌కు ఎంతో చరిత్ర ఉంది: జీఎం సందీప్ మాధుర్
అనంతరం దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ మాట్లాడుతూ.. విశాఖ రైల్వే స్టేషన్‌కు ఎంతో చరిత్ర ఉందని అన్నారు. ‘130 ఏళ్ల క్రితం విశాఖ రైల్వే స్టేషన్ ప్రారంభం అయింది. రెండు ప్లాట్ ఫారంలతో మొదలైన విశాఖ రైల్వే స్టేషన్‌లో ఇప్పుడు ఎనిమిది ప్లాట్ ఫారంలు ఉన్నాయి. త్వరలో ఈ సంఖ్య 14కు పెరుగుతుంది. ఇప్పటికే పనులు జరుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ 130 ఏళ్ల ప్రయాణానికి అద్దం పట్టేలా ప్రదర్శనలు నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించారు.
ఈ వార్తలూ చదవండి
ఘనంగా విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం
విజయవాడ దసరాకు 25 లక్షల మంది భక్తులు.. ఏఐతో నిఘా: మంత్రి సత్యకుమార్