Share News

ఘనంగా విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం..

ABN , Publish Date - Sep 28 , 2026 | 03:16 PM

విజయవాడ ఉత్సవ్-2026 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని అంబేడ్కర్ కళా వేదికలో విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఘనంగా విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం..
Vijayawada Utsav 2026

అమరావతి: విజయవాడ ఉత్సవ్-2026 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈరోజు (సోమవారం) నగరంలోని అంబేడ్కర్ కళా వేదికలో విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము పాల్గొన్నారు. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'విజయవాడకు చారిత్రక నేపథ్యం, ఘనమైన వారసత్వ సంపద ఉంది. కళలు, రాజకీయాలకు ఈ నగరం ప్రతీక. ఇవన్నీ కలబోసి విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్‌కు, సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు. ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమం కాదు.. చిరు వ్యాపారులు ఆర్థికంగా బలపడే కార్యక్రమం. ఎక్కడికి వెళ్లినా మన తెలుగు వారు భాగస్వామ్యం అవుతున్నారు. విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలతో పాటు, విజయవాడ ఉత్సవ్‌లోనూ అందరూ భాగస్వామ్యం కావాలని భావిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సంపద సృష్టించబడుతుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కారణంగా ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికం, సాంస్కృతికం, సమ్మేళనంతో అందరికీ ఆనందాన్ని పంచుతుంది. విజయవాడ ఉత్సవ్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు ప్రజలను అలరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి' అని అన్నారు.


కృష్ణా తీరాన్ని సాంస్కృతిక తీరంగా మార్చిన ఘనత ఎంపీ కేశినేని శివనాథ్‌దే అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌ను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సహభాగస్వామిగా ఏపీ పర్యాటక శాఖ ఉండటం ఆనందంగా ఉందన్నారు. గతేడాది వైబ్రంట్ పేరుకు తగ్గట్లే అద్భుతంగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించారని కొనియాడారు. ఈసారి కూడా ఇంకా గొప్పగా ఈ ఉత్సవ్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థికపరమైన అభివృద్ధి, కళాకారుల ప్రతిభ ఈ ఉత్సవాల్లో ఆవిష్కృతమవుతుందని చెప్పుకొచ్చారు. ఇటువంటి ఉత్సవాల వల్ల చిరు వ్యాపారులకు ఆదాయం పెరుగుతుందని, ఆటో డ్రైవర్లకు నిత్యం ఆదాయం లభిస్తుందన్నారు.


ప్రతి ఏడాది రాష్ట్ర నలుమూలలా ఏదో ఒక ఉత్సవం జరగాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌లో అందరూ పాల్గొనాలని మంత్రి దుర్గేశ్ పిలుపునిచ్చారు. కాగా, విజయవాడ ఉత్సవ్-2026లో భాగంగా పున్నమి ఘాట్‌, ఎంబీకే స్టేడియం, ఫెర్రీ ఘాట్‌లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడ దసరాకు 25 లక్షల మంది భక్తులు.. ఏఐతో నిఘా: మంత్రి సత్యకుమార్

బీసీలను అణగదొక్కేందుకే రిజర్వేషన్లను తగ్గించారు.. జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Updated Date - Sep 28 , 2026 | 03:18 PM