బీసీలను అణగదొక్కేందుకే రిజర్వేషన్లను తగ్గించారు.. జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
ABN , Publish Date - Sep 28 , 2026 | 02:56 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని.. ఐదేళ్లు బీసీలను అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 28: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని.. ఐదేళ్లు బీసీలను అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించింది జగన్‌రెడ్డే అని విమర్శించారు. రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరమయ్యారని తెలిపారు. బీసీల రిజర్వేషన్లను 34 శాతానికి పునరుద్ధరిస్తే.. అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచే బీసీలకు రాజకీయ గుర్తింపు వచ్చిందని.. చంద్రబాబు సారథ్యంలో మరింత సాధికారత లభించిందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల అభ్యున్నతికి రూ.32,534 కోట్లు ఖర్చు చేశామని మంత్రి చెప్పారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల ఆర్థికసాయం ఇవ్వడంతో పాటు.. సబ్సిడీపై బోట్లు, డీజిల్ ఇచ్చినట్లు తెలిపారు. వడ్డెర్లకు 33 శాతం మైనింగ్ లీజులు, కల్లుగీత కార్మికులకు 10 శాతం ఎక్సైజ్ దుకాణాలు, నేతన్న సేవలో పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయం అందించామన్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇచ్చామన్నారు.
బీసీలకు హక్కులు, అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లతో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరగబోతోందని వెల్లడించారు. బీసీలను మరోసారి మోసం చేయడానికి వైసీపీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి
విజయవాడ దసరాకు 25 లక్షల మంది భక్తులు.. ఏఐతో నిఘా: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telugu News