స్థానిక ఎన్నికల్లో వైసీపీ కూటమి ప్రభుత్వంపై చేసిన ఫేక్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు: ఎంపీ భరత్
ABN , Publish Date - Nov 03 , 2026 | 08:51 PM
విశాఖ జీవీఎంసీలో ప్రశాంతత కోసం , అభివృద్ధి కోసం ప్రజలు భారీ విజయాన్ని కూటమికి ఇచ్చారని విశాఖపట్నం ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలు కలిసికట్టుగా పని చేశాయని, ప్రజలు తమను సుమారు 100 వరకు వార్డుల్లో గెలిపించారని ప్రస్తావించారు.
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): విశాఖ జీవీఎంసీలో ప్రశాంతత కోసం , అభివృద్ధి కోసం ప్రజలు భారీ విజయాన్ని కూటమికి ఇచ్చారని విశాఖపట్నం ఎంపీ భరత్ (TDP Visakhapatnam MP Bharat) వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలు కలిసికట్టుగా పని చేశాయని, ప్రజలు తమను సుమారు 100 వరకు వార్డుల్లో గెలిపించారని ప్రస్తావించారు. విశాఖపట్నం ప్రజలు తమ ప్రభుత్వ పనితనం చూసి ఓటు వేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై చేసిన ఫేక్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, చాలా మంది త్యాగాలు చేశారని.. వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని భరోసా కల్పించారు. డీవీ సుబ్బారావు (dv Subbarao) తర్వాత ఇప్పుడే మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుందని ఎంపీ భరత్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజలు ఓట్లు వేశారు: విష్ణు కుమార్ రాజు
స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజలు ఓట్లు వేశారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూటమికి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు. మనందరం కలిసి పని చేసి విశాఖను అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు.
వైసీపీ ఇప్పటికైనా ఆలోచించాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ
స్థానిక ఎన్నికల్లో కూటమిని ఆదరించిన ప్రజలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ఇప్పటికైనా ఆలోచించాలని.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే ఇవ్వాలని సూచించారు.
విశాఖ ప్రజలు టీడీపీకి కంచుకోట అని మరోసారి నిరూపించారు: మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి
విశాఖ ప్రజలు టీడీపీకి కంచుకోట అని మరోసారి నిరూపించారని మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పేర్కొన్నారు. సామాన్యులను పార్టీ గుర్తించి మేయర్‌గా అవకాశం ఇచ్చిందని వెల్లడించారు. విశాఖ ప్రజలు ఇంత మెజార్టీ ఇచ్చారంటే ఇదీ ఒక బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత ప్రజలకు చేసిన అభివృద్ధిని ప్రజలు నమ్మి తనను గెలిపించారని.. దానిని వమ్ము చేయమని ముక్కా శ్రావణి మాటిచ్చారు.