Share News

అల్లూరి ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత.. 1,373 కేజీల స్వాధీనం

ABN , Publish Date - Jul 13 , 2026 | 09:10 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు భారీ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు.

అల్లూరి ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత.. 1,373 కేజీల స్వాధీనం
Cannabis Seizure

అల్లూరి సీతారామరాజు జిల్లా, జులై 13 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు భారీ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ముంచంగిపుట్టు మండలం కుజపంగి జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో 1,373 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ ప్రాంతం నుంచి పెదబయలు మండలం జామిగుడా – రోడకోట మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కుజపంగి జంక్షన్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు.


తనిఖీల సమయంలో వాహనంలో 43 బస్తాల్లో తరలిస్తున్న 1,373 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో ఈ గంజాయి విలువ కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన దయానిధి ఖురాను పోలీసులు అరెస్టు చేశారు.


అయితే ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు సంబంధం ఉన్న మరికొందరు నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ రవాణా వెనుక ఉన్న ముఠా వివరాలు ఏమిటనే అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన చర్యలు చేపట్టామని పోలీసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 09:52 PM