అల్లూరి జిల్లాలో అమానుషం.. బాలికకు అట్లకాడతో వాతలు
ABN , Publish Date - Jun 30 , 2026 | 09:29 AM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ చిన్నారిపై జరిగిన అమానుష ఘటన కలకలం రేపుతోంది. రూ.10 వేలు దొంగతనం చేసిందనే అనుమానంతో 8 ఏళ్ల బాలిక చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ చిన్నారిపై జరిగిన అమానుష ఘటన కలకలం రేపుతోంది. రూ.10 వేలు దొంగతనం చేసిందనే అనుమానంతో 8 ఏళ్ల బాలిక చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని ఏనుగుబైలు గ్రామానికి చెందిన వసంత (8) అనే బాలిక గత 10 నెలలుగా స్థానిక పాస్టర్ జయిరాజ్ సంరక్షణలో ఉంటూ చదువుకుంటోంది. బాలిక విద్యాభ్యాసం, సంరక్షణ బాధ్యతలను పాస్టర్ కుటుంబం చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో రూ.10 వేల నగదు కనిపించకపోవడంతో బాలికపై అనుమానం వ్యక్తమైంది. పాస్టర్ జయిరాజ్ ఇంటి పక్కనే నివసించే రూపావతి అనే మహిళ, బాలికే డబ్బు తీసి ఉంటుందని అనుమానించి ఆమెపై దారుణంగా ప్రవర్తించింది. వేడి అట్లకాడతో బాలిక చేతులపై వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. బాలిక చేతులపై కాలిన గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో పాస్టర్ దంపతులు రూపావతిని అడ్డుకోలేదని, కనీసం ప్రశ్నించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాలికపై జరిగిన హింసాత్మక చర్యలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు
జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News