వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:37 PM
ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అవి అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అవి అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఉద్ఘాటించారు. ఏనుగుల కారిడార్ల రక్షణ, ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ బలోపేతం, సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. వరల్డ్ ఎలిఫెండ్ డే వేడుకలను విశాఖపట్నంలో ఈరోజు (గురువారం) నిర్వహించారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ఏపీలో 132 నుంచి 142 అడవి ఏనుగులు..
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 132 నుంచి 142 అడవి ఏనుగులు ఉన్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. వాటి సంరక్షణ మనకు గర్వకారణమే కాకుండా బాధ్యత కూడా అని తెలిపారు. మనిషి – ఏనుగు ఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అటవీ శాఖల మధ్య సహకారం కొనసాగుతోందని తెలిపారు. కర్ణాటక అటవీ శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కుంకీ ఏనుగులు అందాయని ప్రస్తావించారు. వాటి కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. కుంకీ ఏనుగుల సహాయంతో ఇప్పటికే 15 మనిషి – ఏనుగు ఘర్షణ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామని వెల్లడించారు. దీంతో ఏనుగుల కారణంగా జరిగే మానవ ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మనిషి – వన్యప్రాణుల ఘర్షణల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు.
వన్యప్రాణుల రక్షణ కోసం వంద ప్రత్యేక వాహనాలు..
వన్యప్రాణుల రక్షణ కోసం వంద ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇప్పటివరకు 200కు పైగా వన్యప్రాణులను రక్షించామని చెప్పారు. రైతులకు సకాలంలో హెచ్చరికలు అందించడం, అటవీ సిబ్బందికి ఆధునిక పరికరాలు, శిక్షణ కల్పించడం, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యాలని వ్యాఖ్యానించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదని.. ప్రజలను భాగస్వామ్యం చేసి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. ఏనుగుల సంరక్షణపై దేశవ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో 21,450 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారి ఉత్సాహం, చైతన్యాన్ని అభినందిస్తున్నామని అన్నారు. అభివృద్ధికి బాధ్యత ఉండాలి, సంరక్షణకు లక్ష్యం ఉండాలని తెలిపారు. వన్యప్రాణులను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News