మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం
ABN , Publish Date - Jun 18 , 2026 | 09:31 PM
ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూతపడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది.
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతో ఈ స్కూలు మూతపడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి ఈ పాఠశాల వచ్చింది. వందలాది విద్యార్థుల ప్రవేశాలతో విశాఖ విమల విద్యాలయం కళకళలాడుతోంది. విశాఖ వ్యాలీ స్కూలు మోడల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలను నిర్వహించనుంది.
ఆర్థిక ఇబ్బందులతో..
అయితే, నలభై ఏళ్లుగా విద్యల వెలుగుదివ్వెగా నిలిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్ ఉక్కునగరం సెక్టార్-6లో ఉన్న విశాఖ విమల విద్యాలయంపై గతంలో ఆర్థిక ఇబ్బందుల చీకట్లు కమ్ముకున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఆర్థిక సహాయాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడంతో, జూన్ 2024లో ఈ బడి మూతపడింది. గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రతిష్ఠాత్మక విశాఖ విమల విద్యాలయాన్ని ఎలాగైనా పున:ప్రారంభించాలని ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యాలయం ఆరంభం అయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను మంత్రి లోకేశ్ జారీ చేశారు.
లోకేశ్ కీలకపాత్ర..
ఇది ఒక పాఠశాల సమస్యగా చూడకుండా, దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన ప్రతిష్ఠాత్మక విద్యాలయాన్ని కొనసాగించే కృతనిశ్చయంతో పనిచేశారు. మంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంగా పనిచేయడంతో విశాఖ విమల విద్యాలయం పున:ప్రారంభమైంది. ప్రభుత్వమే పాఠశాల నిర్వహణ బాధ్యతలను తీసుకుంది. విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్‌లోనే కలెక్టర్ చైర్మన్‌గా విశాఖ విమల విద్యాలయాన్ని నిర్వహించి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కేంద్రంతో మాట్లాడి రూ.12 వేల కోట్లు ప్యాకేజీ సాధించిన కూటమి ప్రభుత్వం కృషిలో మంత్రి నారా లోకేశ్ కీలకపాత్ర పోషించారు.
జూన్ 12న విశాఖ విమల విద్యాలయం పున:ప్రారంభం
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పనిచేసినట్లే, మూతపడిన విశాఖ విమల విద్యాలయాన్ని తెరిపించేందుకు మంత్రి నారా లోకేశ్ విశేష కృషి చేశారు. జూన్ 12వ తేదీన విశాఖ విమల విద్యాలయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మళ్లీ ప్రారంభించారు. యూకేజీ వరకూ 55మంది విద్యార్థులు, ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకూ 723 మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కోసం ఈ బడిలో చేరారు. పున:ప్రారంభం రోజునే వందలాది మంది పిల్లలు చేరడం విశాఖ విమల విద్యాలయం ప్రతిష్ఠను చాటిచెబుతోంది. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో పాఠశాలలో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని కూడా ఆరంభించారు.

విశాఖ విమల విద్యాలయం చరిత్ర..
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు 1984లో ఆర్ సీఎం డయాసిస్ వారితో ఒప్పందం చేసుకుని విశాఖ విమల విద్యాలయాన్ని ప్రారంభించారు. ఫ్రీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ప్రాజెక్టు స్కూలుగా దశాబ్దాలుగా కొనసాగింది. మొదట్లో కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లలకే స్కూల్లో ప్రవేశాలు కల్పించేవారు. రాను రాను ఉద్యోగుల పిల్లలు తగ్గిపోవడంతో RINL కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలు, నిర్వాసితుల పిల్లలకు ఇక్కడ సీట్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఉక్కునగరం పరిధిలో 36 కాలనీల పిల్లలను కూడా ఈ బడిలో చేర్చుకున్నారు.
2024లో ఈ బడి మూత..
కాంట్రాక్ట్ ఉద్యోగుల పిల్లలు, పునరావాస కాలనీలు, నిరుపేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో విశాఖ విమల విద్యాలయం పాత్ర గణనీయమైనది. RINL ఆర్థిక సహాయాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడంతో, జూన్ 2024లో విశాఖ విమల విద్యాలయాన్ని ఆర్ సీఎం డయాసిస్ మూసివేసింది. మూసివేసే నాటికి సుమారు 2,200 మంది విద్యార్థులు, 100 మంది బోధన, బోధనేతర ఉద్యోగులు పనిచేసేవారు. నేరుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని ఈ విద్యాలయం పున:ప్రారంభం చేయడంతో వేలాది మంది విద్యార్థులకు వెలుగుబాట అయ్యింది. ప్రశ్నార్థకమైన టీచర్లు, సిబ్బంది భవితవ్యానికి ఒక భరోసా దొరికింది.
ఈ వార్తలు కూడా చదవండి...
సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News