హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:58 AM
హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై 91 తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది.
శ్రీకాకుళం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై 91 (Fly 91) తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు, సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఫ్లై 91 సంస్థ తన కార్యకలాపాలను విస్తరించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఈ నూతన సర్వీసును శ్రీకాకుళం నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ఈ సర్వీసును ఈరోజు (శుక్రవారం) ప్రారంభించారు. తక్కువ ధరలో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.
సామాన్యులు కూడా విమానం ఎక్కాలి: రామ్మోహన్ నాయుడు
విమాన సర్వీసును ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం ద్వారా సామాన్యులు కూడా విమానం ఎక్కాలన్న ప్రధానమంత్రి కల నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య రద్దీ దృష్ట్యా ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు..
రోడ్డు మార్గంలో సుమారు 5 నుంచి 6 గంటల సమయం పట్టే ప్రయాణం, విమానం ద్వారా కేవలం 50 నిమిషాల నుంచి గంటలో పూర్తవుతుంది. హైదరాబాద్‌లో ఐటీ రంగం, విజయవాడలో వ్యాపార రంగాలు బలంగా ఉన్న నేపథ్యంలో, ఈ విమాన సర్వీస్ వ్యాపారవేత్తలకు వరంలా మారనుంది. ఫ్లై 91 సంస్థ తన టికెట్ ధరలను ఇతర విమాన సంస్థలతో పోలిస్తే అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు చేస్తోంది.
నెట్‌వర్క్ పెంచుకునే దిశగా ఫ్లై 91 చర్యలు..
ఫ్లై 91 అనేది గోవా కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రాంతీయ విమానయాన సంస్థ. ఇది ప్రధానంగా తక్కువ దూరం ఉండే నగరాల మధ్య సర్వీసులను నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తమ నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ద్వారా ప్రయాణికులకు మరిన్నిసౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త సర్వీసు అందుబాటులోకి రావడం వల్ల అటు విజయవాడ ప్రాంత ప్రజలకు, ఇటు హైదరాబాద్ ప్రజలకు రవాణా పరంగా మరిన్ని వెసులుబాట్లు కలగనున్నాయి. ఈ విమాన సర్వీసు అందుబాటులోకి రావడం వల్ల రోడ్డు ప్రయాణంపై ఒత్తిడి తగ్గనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు
పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telangana News And International News And Telugu News