Share News

సర్కారు బడుల విద్యార్థుల్లో గ్లోబల్‌ సత్తా!

ABN , Publish Date - May 06 , 2026 | 12:23 AM

Congratulatory meeting for top ten results రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్‌స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు.

సర్కారు బడుల విద్యార్థుల్లో గ్లోబల్‌ సత్తా!
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

పది ఫలితాల్లో కార్పొరేట్‌ను తలదన్నే విజయాలు

మంత్రి లోకేశ్‌ సంస్కరణలతోనే విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు

పాతపట్నం టాపర్ల అభినందన సభలో వర్చువల్‌గా కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్‌స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు. మంగళవారం పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో.. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. మండలాల వారీగా టాపర్లను పేర్లతో పలుకరిస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న వసతులు, విద్యాబోధన తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో పాఠశాల విద్యలో సమూలమార్పులు తీసుకువచ్చారు. ఫలితంగా కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలదన్నేలా సర్కారు బడుల విద్యార్థులు విజయాలు సాధించడం శుభపరిణామం. మెగా డీఎస్సీ, తల్లికి వందనం, మెగా పేరెంట్‌-టీచర్‌ మీట్‌, మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు, ప్రశాంతమైన తరగతి గదులు, అత్యుత్తమ పాఠ్యపుస్తకాల రూపకల్పన.. ఇవన్నీ ఏపీ విజన్‌కు నిదర్శనం. విద్యావ్యవస్థలో రాజకీయాలకు తావులేకుండా, విద్యార్థుల బలమైన భవిష్యత్‌కు రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేస్తోంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, దేశంలోనే ఏపీ ప్రభుత్వ బడులను రోల్‌మోడల్‌గా నిలపడంలో కూటమి ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. భవిష్యత్తులో జిల్లా విద్యార్థులు మరింత ఉన్నతస్థాయికి ఎదగాల’ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:23 AM