Share News

నీళ్లు లేకున్నా వేల ఎకరాలు పెంచారు!

ABN , Publish Date - Aug 09 , 2026 | 09:58 AM

424 గిరిజన గ్రామాలు... 30 వేల 870 కుటుంబాలు... 71 వేల 870 ఎకరాల్లో విస్తరించిన తోటలు... దాదాపు రూ.250 కోట్లకు పైగా వార్షిక ఆదాయం... ఇదంతా ఏదో భారీ పరిశ్రమ సృష్టించిన సంపద కాదు.

నీళ్లు లేకున్నా వేల ఎకరాలు పెంచారు!

424 గిరిజన గ్రామాలు... 30 వేల 870 కుటుంబాలు... 71 వేల 870 ఎకరాల్లో విస్తరించిన తోటలు... దాదాపు రూ.250 కోట్లకు పైగా వార్షిక ఆదాయం... ఇదంతా ఏదో భారీ పరిశ్రమ సృష్టించిన సంపద కాదు. ఫ్యాక్టరీలు తెచ్చిన ఆర్థిక వ్యవస్థ కాదు. గుంతలు, మట్టి, వాన, రైతుల శ్రమ... ఈ నాలుగింటినీ ఒక పద్ధతిలో కలిపితే, సహజ వనరులతో పేద కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను ఎలా సృష్టించవచ్చో నిరూపించిన ఒక అభివృద్ధి నమూనా. ఓ మన్యం కథ...

నలభై ఏళ్ల క్రితం మన్యం కథ ఇలా లేదు. కఠిక పేదరికం, ఉపాధి కోసం నిరంతర పోరాటం ఉండేది. గిరిజన కుటుంబాలకు భూమి ఉంది. వాన ఉంది. శ్రమించే చేతులున్నాయి కానీ, సహజ వనరులను స్థిరమైన ఆదాయంగా మార్చే ఒక పద్ధతి లేదు. ఒక అధికారి ఆ పరిస్ధితిని మరో కోణంలో చూశారు. అదే... వర్షాధార తోటల పెంపకం కార్యక్రమం. నీటిపారుదల లేదు. బోర్లు లేవు. రోజూ నీళ్లు పెట్టే అవకాశం లేదు. కేవలం వాన చినుకులే ఆధారం. అయినా... ఆ కొండ భూముల్లో జీడిమామిడి తోటలను విజయవంతంగా పెంచవచ్చని విశ్వసించారు.


‘‘ఒకసారి ఔరంగాబాద్‌లో స్వచ్ఛంద కార్యకర్త రణధీరేని కలిశాను. అక్కడి సగటు వర్షపాతం రంపచోడవరం వర్షపాతం కన్నా తక్కువ. అలాంటి ప్రాంతంలో ఆయన చెంబు నీళ్లు కూడా పోయకుండా కొందరు రైతులతో మామిడి తోటలు పెంచుతున్నారు. అక్కడ పుష్కలంగా మామిడి కాయలు వేలాడటం చూశాను. ఈ అద్భుతం వెనుక ఏముందీ అని ఆయన్ని అడిగినపుడు, మొక్కలకు కావాల్సినది నీళ్లు కాదు, తేమ అని ఒక ప్రకృతి రహస్యం చెప్పారు. దానినే రంపచోడవరంలో (ఇప్పుడు పోలవరం జిల్లా) గిరిజన రైతులకు చెప్పి అమలు చేశాం. 500 మిల్లీ మీటర్ల వర్షంతోనే ఒక ఎకరం భూమిపై సుమారు 20 లక్షల లీటర్లకు పైగా నీరు కురుస్తుంది. ఆ నీటిని నేలలోనే నిల్వ చేయగలిగితే, అదే భవిష్యత్‌ పంటలకు అమూల్యమైన నీటి నిల్వ అవుతుంది’’ అని వివరించారు 1983లో ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా పనిచేసిన మనోహర్‌ ప్రసాద్‌.


book5.2.jpgగొయ్యిలో విప్లవం...

రంపచోడవరం లాంటి ప్రాంతాల్లో ఒక తోట విజయవంతం కావాలంటే, మొక్కను నాటే ముందు తీసిన గొయ్యి ముఖ్యం. ఈ తోటల కార్యక్రమంలో ప్రతీ మొక్క కోసం మూడు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు, మూడు అడుగుల లోతు ఉండే గోతిని తవ్వేవారు. అది కేవలం జీడివిత్తనం పెట్టేందుకు తీసిన రంధ్రం కాదు. మొలకెత్తిన తరువాత మొక్క బతకడానికి అవసరమైన నీటిని నిల్వ చేసే చిన్న జలాశయం. మట్టిని సజీవంగా ఉంచే జీవవ్యవస్థ. భవిష్యత్తులో చెట్టుకు తేమను అందించే నీటి నిల్వ కేంద్రం.


‘‘గోతి అడుగున ఎండిన ఆకులు, గడ్డి, ఇతర వృక్ష అవశేషాలతో ఒక పొర వేసేవాళ్లం. ఈ పొర వర్షపు నీటిని పీల్చుకొని నెమ్మదిగా మట్టికి అందిస్తుంది. కాలక్రమంలో అది కుళ్లి సహజ ఎరువుగా మారుతుంది. ఆ తరువాత గోతిని మొదట తీసిన పై మట్టినే మళ్లీ పై భాగంలో వేయాలి. చివరిగా, గోతి పైభాగంలో కూడా ఆకులు, గడ్డి, వృక్ష అవశేషాలతో మరో పొర వేయాలి’’ అని మారేడుమిల్లికి చెందిన రైతు సోమిరెడ్డి అంటారు. ఇలా 71 వేల 870 ఎకరాల్లో జీడిమామిడి విత్తనాలు నాటడంతో అవి నేడు తోటలుగా విస్తరించాయి.


book5.3.jpg‘వర్షాధార ప్రాంతాల్లో తోటల విజయానికి కారణం వర్షపాతం మాత్రమే కాదు. ప్రతీ వాననీటి చుక్కను భూమిలో నిల్వ చేసే సామర్థ్యంతో నిర్మించిన గొయ్యి. ఆ రోజుల్లో ఈ విధానంలో మొక్కల పెంపకం వల్ల భూమిలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి సేంద్రీయ పదార్థాలు మట్టిలో పెరిగాయి. అంత పద్ధతిగా గోతులు తీశారు కాబట్టి ఇప్పటికీ ఆ తోటల్లో జీడిమామిడి దిగుబడి బాగుంది. మా ఉద్యాన శాఖ నర్సరీ విభాగం ద్వారా అప్పటి చెట్ల కొమ్మలను అంటు కట్టి మొక్కలను అభివృద్ధి చేస్తున్నాం’ అన్నారు పందిరి మామిడిలో ఉద్యానశాఖ సీనియర్‌ సైంటిస్ట్‌ వెంగయ్య. మొక్క కన్నా ముందు గోతిని సరిగ్గా తయారు చేయాలి. ఆ గొయ్యి తోటకు బలమైన పునాది అంటారాయన.


ఎక్కడో మహారాష్ట్రలో చూసిన ఆలోచన... ఈరోజు తూరుపు మన్యంలో ఒక మహావృక్షంగా ఎదిగింది. ఒకప్పుడు బీడుగా కనిపించిన కొండ భూములు... నేడు వేల ఎకరాల జీడిమామిడి తోటలుగా విస్తరించాయి.

‘‘ఒకప్పుడు మా తాతలు పేదరికంతో పోరాడినవారు. నేడు తోటల వల్ల మా బతుకులు ఒక దారిలో పడ్డాయి. తోటల మధ్య అంతరపంటలు వేసుకొని అదనపు ఆదాయం ఆర్జిస్తున్నాం. పిల్లలు ఉన్నత చదువులు చదివి సెటిల్‌ అవుతున్నారు. ఇండ్లు కట్టుకున్నాం. అన్నింటికీ మించి అప్పులు లేకుండా బతుకుతున్నాం’’ అన్నారు ధాన్యపాలెంకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కురసం అమ్మాజీ.


book5.4.jpgవేలాదిమంది రైతుల భాగస్వామ్యం, నాలుగు దశాబ్దాల నిరంతర శ్రమ, ఇప్పుడు 250 కోట్లకు పైగా వార్షిక సంపదను సృష్టిస్తున్న ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థగా మన ముందుంది. సహజ వనరులను గుర్తించి... స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి... ప్రజలను భాగస్వాములుగా చేసి... దీర్ఘకాలిక దృష్టితో పనిచేస్తే... పేదరికాన్ని తగ్గించడమే కాదు, సహజ వనరులను రైతుల సహకారంతో సంపదగా మలిస్తే... గ్రామీణ భారతదేశ భవిష్యత్తు ఎలా మారుతుందో నిరూపించారు ఈ మన్యం ప్రజలు.

  • శ్యాంమోహన్‌, 94405 95858


ఈ వార్తలు కూడా చదవండి:

నాలుగు రోజుల పాటు బంగారం ధరల్లో పెరుగుదల.. ప్రస్తుతం రేట్స్ ఇవీ

15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News


Updated Date - Aug 09 , 2026 | 09:58 AM