Share News

స్విగ్గీ డెలివరీ బాయ్‌ ‘కథే’ వేరు!

ABN , Publish Date - Aug 09 , 2026 | 09:24 AM

దేశంలోని లక్షలాది మంది గిగ్‌ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు.

స్విగ్గీ డెలివరీ బాయ్‌ ‘కథే’ వేరు!
Swiggy Delivery Boy

దేశంలోని లక్షలాది మంది గిగ్‌ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు. ఆసుపత్రి బెడ్‌ మీద తనలోని కథకుడిని బయటకు తీసుకొచ్చి, లక్షలాది మందిని ఆకట్టుకున్నాడు. ఓ డెలివరీ బాయ్‌ కథకుడిగా మారి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. అతడే... అజిత్‌కుమార్‌. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సదరు అ‘సామాన్యుడి’ విజయగాథ ఆద్యంతం ఆసక్తికరం...

ఫరీదాబాద్‌కు చెందిన అజిత్‌ కుమార్‌ తండ్రి కుటుంబపోషణ కోసం ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు వలస వెళ్లారు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన చిన్నాచితకా పనులు చేసేవారు. తండ్రి కష్టం చూసీచూసి, డబ్బు విలువ అజిత్‌కుమార్‌కు చిన్నతనంలోనే తెలిసొచ్చింది. అయితే అక్క పెళ్లితో కుటుంబ పరిస్థితి మరింత దిగజారిపోయింది. పెళ్లికి చేసిన అప్పుల కారణంగా ఇంటిపోషణలో తాను కూడా భాగం పంచుకోక తప్పలేదు. అప్పటికే వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు అజిత్‌. ఒకవైపు చదువుకుంటూనే ఇంటి అవసరాల కోసం మేకప్‌, మెహందీ డిజైన్స్‌ వేస్తూ అంతో ఇంతో సంపాదించేవాడు. అయినా కూడా అప్పులు తీరేవి కావు. సరిగ్గా అదే సమయంలో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు... కొవిడ్‌ మహమ్మారి అజిత్‌ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది.


  • కారు ప్రమాదం...

కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా అజిత్‌ కాలేజీ మానేయాల్సి వచ్చింది. అప్పటికే అతడు చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇల్లు గడవడం కూడా కష్టమైంది. ఏదైనా ఉద్యోగం చేయాలను కున్నాడు. ఒక స్నేహితుడు ఫుడ్‌ డెలివరీ ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. స్విగ్గీ డెలివరీ రైడర్‌గా పని చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తన దగ్గర సైకిల్‌ మాత్రమే ఉండేది. రోజుకు 20 ఆర్డర్లను పూర్తి చేయాలంటే కనీసం 100 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చేది. అత్యంత విషాదం ఏమిటంటే... దురదృష్టం అతడి సైకిల్‌ సీటు వెనకాలే కూర్చుని ప్రయాణించేదేమో. ఒకరోజు ఫుడ్‌ డెలివరీకి వెళ్తుంటే కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కళ్లు తెరచి చూసేసరికి ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్నాడు. ఒక కాలు తీవ్రంగా దెబ్బ తింది. అజిత్‌ వైద్య చికిత్స కోసం కుటుంబం మరిన్ని అప్పులు చేయక తప్పలేదు. అతడికి కాలి బాధ కన్నా అప్పులోళ్ల బాధ ఎక్కువైంది. ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు ‘పాకెట్‌ ఎఫ్‌ఎమ్‌’ ప్రచార వీడియో ఒకటి అతని కంటపడింది.


book4.2.jpg

  • కథ చెబుతూ..

అప్పటిదాకా చదవడం, కష్టపడి పనిచేయడం మాత్రమే తెలుసు అజిత్‌కు. తను చూసిన ప్రకటనకు న్యాయం చేయగలనా? అని కాసేపు ఆలోచించాడు. కథలు రాసి డబ్బు సంపాదించడం చేతనవుతుందా? అనే అనుమానం పీడిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అదే సరైన మార్గం అని మనసు ప్రోత్సహిస్తోంది. బెడ్‌పై నుంచి చేసే పని అదొక్కటే, గత్యంతరం లేదని తనను తాను సిద్ధం చేసుకున్నాడు. ఉద్యోగానికి అప్లయ్‌ చేశాడు. ‘పాకెట్‌ ఎఫ్‌ఎమ్‌’ నుంచి పిలుపు వచ్చింది. మొదట్లో రోజుకు నాలుగు నుంచి ఐదు ఎపిసోడ్లు రాసేవాడు. వాళ్లు చెప్పిన కరెక్షన్స్‌ చేస్తూ ముందుకు సాగాడు. అలా రాస్తున్న క్రమంలోనే ఒక పోటీలో అతని కథ ఎంపికైంది. మొదటిసారి ఒక కథకు 20వేల రూపాయలు అందుకున్నాడు. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కథలు రాయడం ప్రారంభించాడు. అలా నెమ్మదినెమ్మదిగా సదరు ప్లాట్‌ఫామ్‌లో అతనికి అగ్రస్థానం దక్కింది. అజిత్‌ కథలకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రోతలు ఏర్పడ్డారు. అతను రాసిన కథ ‘బ్రహ్మయోధ... ది డెస్ట్రాయర్‌’ ఆల్‌టైమ్‌ సూపర్‌హిట్‌. బ్రహ్మయోధ ఒక మైథలాజికల్‌ ఫిక్షన్‌ స్టోరీ.


book4.3.jpgఇప్పటికి ఈ కథని రికార్డు స్థాయిలో 98 లక్షల మంది విన్నారు. పాకెట్‌ ఎఫ్‌ఎమ్‌ పార్టనర్‌లో ఒకరైన రోహన్‌.. ఈ పాకెట్‌ ఎఫ్‌ఎంసిరీస్‌ వెనుక అజిత్‌ కుమార్‌ ఉన్నాడని, రాయల్టీల ద్వారా అతను కోట్లు సంపాదిస్తున్నాడని తెలిపాడు. అంటే.. యూట్యూబ్‌ వ్యూయర్స్‌ లాగే శ్రోతలు కథను విన్నా కొద్దీ అతనికి వచ్చే డబ్బు పెరుగుతుందన్నమాట. సంప్రదాయ భారతీయ గాథలను ఆధారం చేసుకొని ఐదు పౌరాణిక నవలలను రాయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు అజిత్‌. 2026లో జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌కు వక్తగా ఆహ్వానం కూడా అందుకున్నాడు. ఒక స్విగ్గీ డెలివరీ బాయ్‌ ప్రమాదాన్ని తలచుకుంటూ ఏడుస్తూ కూర్చోకుండా... ఆలోచనలను, సృజనాత్మకతను జోడించి సరికొత్త కెరీర్‌కు బాటలు వేసుకున్నాడు. బెడ్‌ మీదే కెరీర్‌ ముగిసిందనుకున్న తరుణంలో కథలు రాస్తూ... తన జీవితకథనే మార్చుకోవడం విశేషమే కదా.


book4.4.jpgపాకెట్‌ ఎఫ్‌ఎమ్‌

ఫాంటసీ, సైన్స్‌ ఫిక్షన్‌, థ్రిల్లర్‌, లవ్‌, హారర్‌, డ్రామా... ఇలా అనేక జానర్‌లలో విభిన్నమైన కథనాలను అందిస్తుంది ‘పాకెట్‌ ఎఫ్‌ఎమ్‌’. లక్ష గంటలకు పైగా కంటెంట్‌, 75వేలకు పైగా ఆడియో సిరీస్‌లతో కూడిన లైబ్రరీ దీని సొంతం. ప్రతీ నెలా దాదాపు 2 లక్షల గంటల కంటెంట్‌ను జోడిస్తుంది. 2018లో రోహన్‌ నాయక్‌, నిశాంత్‌, ప్రతీక్‌ దీక్షిత్‌ అనే ముగ్గురు స్నేహితులు దీనిని ప్రారంభించారు. నైపుణ్యం గల కథకులు, ప్రతిభావంతులైన వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టులు, సృజనాత్మక రచయితలతో కూడిన ఈ ప్లాట్‌పామ్‌ కథలో లీనమయ్యే అనుభవాన్ని శ్రోతలకు అందిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

నాలుగు రోజుల పాటు బంగారం ధరల్లో పెరుగుదల.. ప్రస్తుతం రేట్స్ ఇవీ

15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 09:24 AM