Share News

రొమ్ము క్యాన్సర్‌ పరీక్షకు మహిళలు దూరం

ABN , Publish Date - Aug 09 , 2026 | 06:26 AM

‘క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ (సీబీఈ) చేయించుకుంటే ఎక్కడ క్యాన్సర్‌ బయటపడుతుందో..! రొమ్మును తొలగిస్తారేమో..! అనే భయం చాలా మంది మహిళను ఇంకా వెంటాడుతునే ఉంది.

రొమ్ము క్యాన్సర్‌ పరీక్షకు మహిళలు దూరం

  • స్క్రీనింగ్‌కు ముందుకొస్తున్నది ఒక శాతమే... గ్రామీణుల కంటే పట్టణ మహిళలు వెనకడుగు

  • అమెరికాలోని ఎండీ ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌

  • ఫౌండేషన్‌ పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ‘క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ (సీబీఈ) చేయించుకుంటే ఎక్కడ క్యాన్సర్‌ బయటపడుతుందో..! రొమ్మును తొలగిస్తారేమో..! అనే భయం చాలా మంది మహిళను ఇంకా వెంటాడుతునే ఉంది. ఈ భయం వారిని క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకోవడానికి ముందుకు అడుగు వేయనియడం లేద’ని వైద్యులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్ణణవాసులు సీబీఈ చేయించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం జాతీయస్థాయిలో రొమ్ము క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కార్యక్రమం అమలు జరుగుతున్నప్పటికీ కేవలం ఒక శాతం మంది మహిళలే స్ర్కీనింగ్‌ చేయించుకోవడానికి ముందుకొస్తున్నారని ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ రఘురాం వివరించారు. ఈ పరిస్థితికి కారణాలను తెలుసుకునేందుకు అమెరికాలోని ఎండీ ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌, తమ ఫౌండేషన్‌, మరికొన్ని సంస్థల పరిశోధకులు అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఆ అధ్యయన ఫలితాలను అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ సమావేశంలో ప్రవేశపెట్టగా, అవి జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీలో ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు.


అధ్యయనం ఇలా..!

2025 అక్టోబరులో తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 35 ఏళ్లు దాటిన 669 మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. 421 మంది రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. వారిలో 81.1 శాతం మంది అదే మొదటిసారి పరీక్ష చేయించుకోవడం! ఇక 248 మంది పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించారు. దీనికి అవగాహన లోపం, భయాలు, ఇతర సామాజిక కారణాలు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని డాక్టర్‌ రఘురాం వివరించారు. గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణ, అధిక ఆదాయ కుటుంబాలకు చెందిన మహిళలు పరీక్షలు చేయించుకోవడం తక్కువని అధ్యయనంలో తేలిందని వివరించారు. రొమ్ము క్యాన్సర్‌ వచ్చినవారిలో చాలామంది ఆలస్య దశలో ఆస్పత్రికి వస్తున్నారని, దీనివల్ల చికిత్స అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. రొమ్ము క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. అవి...

  • రొమ్ము ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం.

  • ప్రాథమిక ఆరోగ్య సేవల్లో సీబీఈను భాగం చేయడం.

  • ఆశా కార్యకర్తలకు మెరుగైన శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వడం.

  • మహిళలకు గోప్యత, గౌరవంతో సేవలు అందించడం.

  • రొమ్ము స్ర్కీనింగ్‌ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం.

  • సమాజ భాగస్వామ్యాన్ని పెంచడం.

  • స్క్రీనింగ్‌ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు పర్యవేక్షణను బలోపేతం చేయడం.


ఐదేళ్లలో 2 లక్షల మందికి స్ర్కీనింగ్‌: రఘురామ్‌ స్ర్కీనింగ్‌

2012-2016 మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో కలిసి 4 వేల గ్రామాల్లో 2 లక్షలకుపైగా మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు డాక్టర్‌ రఘురామ్‌ తెలిపారు. ఇందుకోసం 3,750 మంది ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఇది దక్షిణాసియాలోనే అతిపెద్ద స్ర్కీనింగ్‌ కార్యక్రమమని చెప్పారు. క్యాన్సర్‌ నిర్ధారణ అయిన మహిళలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందించామన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 06:34 AM