Share News

అతడు ఒక అద్భుతం.. వైభవ్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్రశంసల జల్లు

ABN , Publish Date - Aug 09 , 2026 | 08:59 AM

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడో ఒక అద్భుతమని, అతడిపై ఒత్తిడి తేవద్దని హితవు పలికాడు.

అతడు ఒక అద్భుతం.. వైభవ్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్రశంసల జల్లు
Australian legend Brett Lee

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్‌ ప్రపంచాన్ని తన అద్భుతమైన బ్యాటింగ్‌తో షేక్ చేస్తున్నాడు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న ఈ కుర్ర సంచలనం, అతి పిన్న వయసులోనే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన ఇటీవల మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ అదరగొట్టిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు.


ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ ఆసీస్ మాజీ పేసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'అతడొక అద్భుతం. భారత్ బయట అందరూ అతని వయసు నిజంగా 15 ఏళ్లేనా అని ప్రశ్నిస్తున్నారు. కానీ నాకు వయసుతో పనిలేదు. అతనికి 15 ఏళ్ల లేదా18 ఏళ్లా.. అనేది ఎవరికి కావాలి?. ఆ అబ్బాయి అద్భుతంగా క్రికెట్ ఆడగలడు. భారత్‌కు దొరికిన గొప్ప వరం అతడు. భవిష్యత్తులో మరెన్నో ఘనతలు సాధిస్తాడు' అని బ్రెట్ లీ కొనియాడారు.


ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా పేసర్ల వేసిన బంతులకు చాలా మంది సీనియర్ బ్యాటర్లు ఇబ్బంది పడితే.. వైభవ్ అవలీలగా హుక్ చేసిన తీరును ఆయన గుర్తుచేశారు. సరైన క్రికెట్ షాట్లు ఆడుతూ, తనలో ఉన్న అపారమైన పవర్‌తో బంతులను బాదుతున్నాడన్నాడు. అయితే, వయసు అంశాన్ని పక్కన పెట్టి అతన్ని ఒక చిన్నపిల్లాడిగా ఉండనివ్వాలని, అనవసరమైన ఒత్తిడి తెవద్దని లీ హితవు పలికాడు. ప్రస్తుతం వైభవ్ ప్రతిభ ప్రపంచ క్రికెట్ దిగ్గజాల సైతం దృష్టిని ఆకర్షిస్తోంది.


ఇవి కూడా చదవండి:

జడేజా అదిరిపోయే కామెడీ.. నవ్వు ఆపుకోలేకపోయిన కోచ్ గంభీర్!

ఆశిష్‌ అదిరెన్‌

Updated Date - Aug 09 , 2026 | 08:59 AM