యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ తెరుచుకోదు: ఇరాన్
ABN , Publish Date - Aug 09 , 2026 | 08:30 AM
యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ జలసంధి తెరుచుకోదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ జలసంధి తెరుచుకోదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా స్పష్టం చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ ప్రకటనను ప్రచురించింది. యూఎస్ ఇక ఎన్నడూ ఇరాన్‌పై బెదిరింపులకు దిగొద్దని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది. నావికా దిగ్బంధనాన్ని తొలగించాలని, సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, యుద్ధం వల్ల ఇరాన్‌కు జరిగిన నష్టాన్ని ఆర్థికంగా పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని పేర్కొంది. విదేశాల్లోని ఇరాన్ ఆస్తులపై ఆంక్షలను బేషరతుగా తొలగించాలని కూడా స్పష్టం చేసింది.
ఈ పరిణామాలపై యూఎస్ ఇంకా స్పందించాల్సి ఉంది. హోర్ముజ్ తెరవడంపై డీల్ కుదిరాకే దిగ్బంధనం గురించి చర్చించాలని అమెరికా పట్టుపడుతోంది. జులైలో కుదిరిన మధ్యంతర డీల్ ప్రకారం, ఆంక్షల తొలగింపునకు షెడ్యూల్, యుద్ధ నష్ట పరిహారం వంటివాటిపై తుది డీల్‌లో భాగంగా చర్చిస్తారు. అంతేకాకుండా, విదేశాల్లోని ఇరాన్ నిధులపై ఆంక్షల తొలగింపు కూడా ఉంటుందని అమెరికా అప్పట్లో పేర్కొంది. ఈ చర్చలను ముగించేందుకు 60 గడువు విధించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ గడువు మరో వారంలో ముగియనుంది. డెడ్‌లైన్‌ను మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉందని కూడా సమాచారం.
మరోవైపు, హోర్ముజ్ నిర్వహణ కోసం ఒమాన్‌తో ప్రత్యేక డీల్ తుది దశకు చేరుకుందని ఇరాన్ తెలిపింది. హోర్ముజ్‌లో రవాణా మార్గంపై డీల్ త్వరలో కుదరవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ప్రస్తుతం గల్ఫ్‌లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమాన్ మాత్రం ఈ పరిణామాలపై ఆచితూచి స్పందించింది. చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని మాత్రం చెప్పింది. జలసంధిలో నౌకలపై దాడులను ఖండించింది.
ఈ వార్తలనూ చదవండి:
భారత ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు!
ఉద్యోగం పోగానే అమెరికాను వీడాల్సిందే!