Share News

భారత ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు!

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:43 AM

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌, చైనా తదితర దేశాలపై 100ు అదనపు సుంకాలు విధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుకు.. అమెరికా సెనేట్‌ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది...

భారత ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు!

  • బిల్లుకు 86/11 ఓట్లతో అమెరికా సెనేట్‌ ఆమోదం

  • ఉక్రెయిన్‌పై రష్యాను నిలువరించేందుకే ఈ బిల్లు

  • ఆ దేశ చమురు కొంటున్న టాప్‌-5 దేశాలే లక్ష్యం

  • ప్రతినిధుల సభ ఆమోదం తర్వాతే అమల్లోకి..

వాషింగ్టన్‌, ఆగస్ట్‌ 8: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌, చైనా తదితర దేశాలపై 100ు అదనపు సుంకాలు విధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుకు.. అమెరికా సెనేట్‌ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. 86మంది అనుకూలంగా ఓటు వేయగా, 11మంది మాత్రమే వ్యతిరేకించారు. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురు, సహజవాయువు, ఇతర ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న ఐదు ప్రధాన దేశాలైన చైనా, భారత్‌, అజర్‌బైజాన్‌, హంగరీ, స్లోవేకియాపై భారీ సుంకాలు, ఆంక్షలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఈ బిల్లు కట్టబెడుతుంది. అంటే ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. రిపబ్లికన్లకు మెజారిటీ కలిగిన ప్రతినిధుల సభ ఆమోదంతోపాటు అధ్యక్షుడు ట్రంప్‌ సంతకంతో ఇది అమల్లోకి రానుంది. ప్రముఖ రిపబ్లికన్‌ నేత లిండ్సే ఓ గ్రాహమ్‌ ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ ఏడాది జూలై 11న ఆయన హఠాన్మరణం చెందడంతో.. బిల్లు పేరును ‘లిండ్సే గ్రాహమ్‌ రష్యా, ఇరాన్‌ ఆంక్షల చట్టం 2026’అని మార్చారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా, రష్యా ఆర్థిక వనరులకు చెక్‌ పెట్టే లక్ష్యంతో గ్రాహమ్‌తోపాటు డెమొక్రాట్‌ రిచర్డ్‌ బ్లుమెంతల్‌ ఈ బిల్లును ప్రతిపాదించారు. చైనా, భారత్‌ తదితర దేశాలు రష్యా నుంచి చౌక చమురు కొనుగోలు చేస్తూ, ఆ డబ్బును ఉక్రెయిన్‌పై యుద్ధానికి వినియోగించేందుకు పరోక్షంగా సహకరిస్తున్నాయని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 40శాతానికి పైగా ఉంది. అయితే, అమెరికా, భారత్‌ మధ్య ట్రేడ్‌ డీల్‌ అమల్లోకి వస్తే ఈ అదనపు సంకాల నుంచి భారత్‌కు మినహాయింపు లభిస్తుందేమో చూడాల్సి ఉంది. వాస్తవానికి తొలి దశ ఒప్పందంపై అంగీకారం కుదిరే వరకు కూడా రష్యా చమురు కొంటుందన్న నెపంతో భారత్‌పై ట్రంప్‌ 25 శాతం అదనపు సుంకాలను అమలు చేయడం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 05:43 AM