డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:42 PM
దేశ రాజధానిలో ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధానిలో ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. సుమారు 3 వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు అందుకోగా.. వారిలో 587 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు ఉన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్ సహా పర్ఫెక్ట్ టెన్ గోల్డ్ మెడల్స్‌ను కూడా ప్రదానం చేశారు మోదీ.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. 'ఐఐటీ విద్యార్థులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ్టి నుంచి మీ కొత్త ప్రయాణం ప్రారంభమైంది' అని అన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీలు తీసుకోవడం లేదని.. దేశ స్వప్నాలను సాకారం చేసే బాధ్యతను స్వీకరిస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి మనసులో ఎన్నో ఆలోచనలు, కలలు, లక్ష్యాలు ఉంటాయన్న ప్రధాని.. లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, తాము అనుకున్న గమ్యాన్ని చేరేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఐఐటీల్లో పొందిన విద్య, నైపుణ్యాలను దేశ అభివృద్ధికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ సోనిపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన 'పరమ్ ప్రజ్ఞ' ఏఐ ఆధారిత హైపెర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సదుపాయాన్ని వర్చువల్ ప్రారంభించారు. కృత్రిమ మేధ, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో దేశ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ సదుపాయం దోహదపడనుంది. ఈ ఏడాది స్నాతకోత్సవంలో ఐఐటీ ఢిల్లీలో కొత్తగా ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్‌సీ, బయోలాజికల్ సైన్సెస్, ఎంఏ కల్చర్, సొసైటీ అండ్ థాట్ కోర్సుల తొలి బ్యాచ్ విద్యార్థులు కూడా డిగ్రీలు అందుకున్నారు.
ఇవీ చదవండి:
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫేక్ పనీర్, నెయ్యి, వెన్నపై కొరడా
మహిళా రిజర్వేషన్ బిల్లు.. రిజిజు వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్!