Share News

ఆశిష్‌ అదిరెన్‌

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:24 AM

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ పతక బోణీ చేసింది. పురుషుల జావెలిన్‌ త్రోలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల ఆశిష్‌ యాదవ్‌ రజత పతకంతో రికార్డు సృష్టించాడు...

ఆశిష్‌ అదిరెన్‌

  • జావెలిన్‌ త్రోలో రజతం

  • వెంకట్రామ్‌కు నిరాశ

  • హైజంప్‌ ఫైనల్‌కు పూజ

  • అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌

యూజీన్‌ (అమెరికా): అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ పతక బోణీ చేసింది. పురుషుల జావెలిన్‌ త్రోలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల ఆశిష్‌ యాదవ్‌ రజత పతకంతో రికార్డు సృష్టించాడు. ఫైనల్లో జావెలిన్‌ను 74.09 మీటర్లు విసిరిన ఆశిష్‌ రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. దీంతో నీరజ్‌ చోప్రా తర్వాత ఈ టోర్నీలో పతకం నెగ్గిన భారత జావెలిన్‌ త్రోయర్‌గా ఆశిష్‌ చరిత్ర సృష్టించాడు. నీరజ్‌ 2016లో జరిగిన అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. మరో భారత త్రోయర్‌ ధరణీధరన్‌ (72.35 మీటర్లు) ఆరో స్థానంలో నిలిచాడు. జాన్‌ హెన్‌డ్రిక్‌ (దక్షిణాఫ్రికా, 80.50 మీ.) స్వర్ణం, అడిసన్‌ జేమ్స్‌ (డొమినికా, 73.80 మీ.) కాంస్య పతకం నెగ్గారు. ఇక, 800 మీటర్ల రేసులో సెమీఫైనల్‌ చేరిన తెలుగు కుర్రాడు వెంకట్రామ్‌ రెడ్డి ఫైనల్‌కు మాత్రం అర్హత సాధించలేకపోయాడు. సెమీఫైనల్‌ హీట్‌2లో వెంకట్రామ్‌ 1:48.40 సెకన్లతో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. సెమీస్‌లో మూడు హీట్స్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు మాత్రమే ఫైనల్‌ చేరతారు. పురుషుల 400 మీటర్ల పరుగు ఫైనల్లో మహ్మద్‌ అష్ఫాక్‌ 46.20 సెకన్ల టైమింగ్‌తో ఎనిమిది స్థానంతో సరిపెట్టుకొన్నాడు. ముందు రోజు అష్ఫాక్‌ సెమీఫైనల్‌ చేరే క్రమంలో హీట్స్‌లో 45.81 సెకన్ల టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కానీ, ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. మహిళల హైజం్‌పలో పూజా సింగ్‌ ఫైనల్‌ చేరి పతక రేసులో నిలిచింది. 1.79 మీటర్లు లంఘించిన 19 ఏళ్ల పూజ..మరో 14 మందితో కలిసి తుదిపోరుకు అర్హత పొందింది. పురుషుల లాంగ్‌జంప్‌లో షానవాజ్‌, జితిన్‌ కూడా ఫైనల్లో ప్రవేశించారు.


18-Sports.jpg

ఎండిపోయిన కుంటలో సాధన చేసి..

నీరజ్‌ చోప్రా స్ఫూర్తితో రెండేళ్ల క్రితం జావెలిన్‌ చేతబట్టిన ఆశిష్‌ యాదవ్‌.. వేగంగా ఎదిగాడు. ప్రాక్టీస్‌ చేయడానికి తగిన మైదానం కూడా లేకపోవడంతో.. ఎండిపోయిన నీటి కుంటలోనే చెక్క జావెలిన్‌తో సాధన చేశాడు. ఉత్తరప్రదేశ్‌, మీర్జాపూర్‌లోని మవయా గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఆశిష్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అండర్‌-20 చాంపియన్‌షిప్‌ జావెలిన్‌ త్రోలో రజతంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2016లో ఇదే ఈవెంట్‌లో చోప్రా స్వర్ణంతో తన ఎంట్రీని ఘనంగా చాటాడు. ఇప్పడు ఆశిష్‌ కూడా అతడి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ‘నాన్న పాల వ్యాపారం చేస్తాడు. నాకు 17 ఏళ్లు వచ్చేవరకు ఆయనకు సహకారంగా ఉన్నా’ అని ఆశిష్‌ చెప్పాడు. బంధువు కొనిచ్చిన చెక్క జావెలిన్‌తోనే ప్రాక్టీస్‌ చేసిన ఆశిష్‌.. సాయ్‌ సెంటర్‌లో కోచ్‌ అరవింద్‌ శిక్షణలో రాటుదేలాడు. ‘ఆ ఎండిపోయిన కుంట మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రాక్టీస్‌ చేయడానికి అంతకంటే మరో స్థలం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే సాధన చేసేవాడిని’ అని ఆశిష్‌ చెప్పాడు. తన ఆటను మెరుగుపర్చుకోవడానికి నీరజ్‌ చోప్రా వీడియోలను చూసేవాడినన్నాడు. ఆశిష్‌ ప్రదర్శన పట్ల నీరజ్‌ చోప్రా కూడా సంతోషం వ్యక్తం చేశాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 05:24 AM