15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ABN , Publish Date - Aug 09 , 2026 | 04:19 AM
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు..
సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ సమయంలోనే మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో కూడా పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో వివరించింది. దీంతో అదనంగా 61.09 లక్షల మంది ఆహార భద్రత పరిధిలోకి వచ్చారు. కొత్తవి మంజూరుతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరగా, 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత లభించనుందని తెలిపింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాల్లో వాటి పంపిణీకి ప్రణాళిక, సమన్వయం బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసి, పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆదేశించింది. కార్డుల పంపిణీ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించింది. కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లాల్లో పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. దీన్ని ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టాలని అన్ని జిల్లాల కలెకర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.