Share News

ఆందోళనకూ ‘ఆభరణం’ ఉందండోయ్‌...

ABN , Publish Date - Aug 09 , 2026 | 08:17 AM

ఆభరణాలనగానే... నెక్లెస్‌, హారం, వడ్డాణం, కాసులపేరు, కంఠాభరణం, గాజులు, ఉంగరాల్లాంటివి కళ్ల ముందు కదలాడతాయి.

ఆందోళనకూ ‘ఆభరణం’ ఉందండోయ్‌...

ఆభరణాలనగానే... నెక్లెస్‌, హారం, వడ్డాణం, కాసులపేరు, కంఠాభరణం, గాజులు, ఉంగరాల్లాంటివి కళ్ల ముందు కదలాడతాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వాటిని ధరించి, ఆ తర్వాత లాకర్లలో భద్రపరుస్తారు. ఇప్పటిదాకా ఆడంబరాన్ని ప్రదర్శించే ఆభరణాలు మాత్రమే చూశాం. నవతరంలో ఆరోగ్యాన్ని పరిరక్షించే ఆభరణాలు తయారవుతున్నాయి. ముఖ్యంగా ఆందోళనను తగ్గించేందుకు ‘యాంటీ యాంగ్జయిటీ ఆభరణాలు’ జెన్‌ జీని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఆభరణం అంటే ఆడంబరమే కాదు... ఆరోగ్యం కూడా...

పోటీ పరీక్షల్లో ఆన్సర్‌ షీట్‌ తీసుకుంటుంటే చేతులు వణకడం, జాబ్‌ ఇంటర్వ్యూలలో నోట్లో తడి ఆరిపోవడం, స్టేజీ ఎక్కి మైకు పట్టుకోగానే నోరు పెగలక నీళ్లు నమలడం... ఇలా ఆందోళనకు లోనయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి. ఆయా సందర్భాలను ఎదుర్కొనేందుకు జెన్‌ జీ కొన్నిరకాల ఆభరణాలను ఆశ్రయిస్తోంది. అవే ‘యాంటీ యాంగ్జయిటీ ఆభరణాలు’గా మార్కెట్‌లో లభిస్తున్నాయి.


ఆభరణాలు... ఆటలాగా...

ఆధునిక జీవనంలో ఒత్తిడి, ఆందోళన భాగం అయిపోయాయి. గుండెదడ పెరిగిన ప్రతీసారి మనసులో పది అంకెలు లెక్కబెట్టుకోవడం, కళ్లు మూసుకుని ప్రాణాయామం చేయడం, గట్టిగా నవ్వుకోవడం లాంటి సంప్రదాయ పద్ధతులు మామూలే. ఇంతకు ముందు ఆందోళనను తగ్గించేందుకు ఫిడ్జెట్‌ స్పిన్నర్స్‌, స్ట్రెస్‌ బాల్స్‌ వంటి సాధనాలు అందుబాటులో ఉండేవి. జెన్‌ జీలు మాత్రం తమ చేతి వేలి ఉంగరానికి ఉన్న గుండ్లను కదుపుతూ లేదా తమ హారానికి ఉన్న పెండెంట్‌ను నోట్లో పెట్టుకుని ఊదడం లాంటివి చేస్తూ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకుంటున్నారు. ఇలాంటి కొత్తరకం సాధనాలన్నీ సోషల్‌ మీడియాలో పాపులరై ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ఆందోళన తగ్గించే


book3.2.jpgఆభరణాలలో కొన్ని...

  • స్పిన్నర్‌ రింగ్‌లు: చూసేందుకు సాధారణ ఉంగరాల్లాగే ఉంటాయి. కానీ ఈ ఉంగరాల పైపొరలో గుండ్లు (రోలింగ్‌ బీడ్స్‌) అమర్చుతారు. అలాగే హారాల పెండెంట్లలో కూడా చుట్టూ తిరిగే గుండు పొదుగుతారు. ఈ గుండ్లను ముందుకూ వెనక్కి కదలించడం ద్వారా స్ట్రెస్‌ను తగ్గించుకోవచ్చన్నది సారాంశం.

  • బ్రీతింగ్‌ పెండెంట్లు: వీటిని ఆయా హారాలలో పెండెంట్లుగా ధరిస్తారు. చిన్న స్ట్రా ఆకారంలో ఉంటాయి. మనసులో ఆందోళన ఉన్నప్పుడు ఈ పెండెంట్‌ను నోటి దగ్గర పెట్టుకుని ఊదాలి. నిమిషంలో ఎక్కువసేపు ఊపిరి బిగపట్టి చేయడం వల్ల ఆందోళన క్రమంగా తగ్గుతుంది.

  • బ్రాస్‌లెట్లు: చక్కని సువాసనలు వెదజల్లే బ్రాస్‌లెట్లను ధరించడం ద్వారా ఎప్పటికప్పుడు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అరోమాథెరపీకి ఉదాహరణగా ఈ ప్రక్రియను పేర్కొనవచ్చు.

  • జెమ్‌స్టోన్స్‌: శాంతిని చేకూర్చే రంగురాళ్ల ఆభరణాలను ధరించడం ఎప్పటి నుంచో ఉంది. ఈ విధానాన్ని జెన్‌ జీలు కూడా ఆసక్తిగా ఫాలో కావడం విశేషం.


భారీగా కనిపించకుండా...

వాస్తవానికి ‘స్పిన్నర్‌ రింగ్‌’లు కొత్తవేం కాదు. క్రీడా వస్తువులలో బాగా ప్రసిద్ధి చెందిన ‘ఫిడ్జెట్‌ టాయ్‌’లతో వీటిని సరిపోల్చుకోవచ్చు. మధ్యలో ఉన్న గుండును కదిలిస్తూ ఉండే ఫిడ్జెట్‌ టాయ్‌ చాలామంది దగ్గర కనిపిస్తుంది. వాటిలాగే స్పిన్నర్‌ రింగ్‌లను ఆభరణంగా తయారుచేస్తున్నారు. జర్మన్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడ్రిక్‌ బెకర్‌ కొంగొత్త ఆలోచనలతో ఆభరణాల డిజైనింగ్‌కు... మెకానికల్‌ ఇంజ6+నీరింగ్‌ ఆర్ట్‌ను జతచేశారు. ఆయన స్వయానా ఇంజనీర్‌. ఆభరణాల డిజైన్లలో కదలికలు, భ్రమణం కోసం గుండ్లు, ఇరుసు లాంటివి చేర్చడం వల్ల వాటి లుక్‌ మారిపోయింది. ఈ మీనియేచర్‌ వర్క్‌ వల్ల ప్రత్యేకంగా కనిపించే ‘మూవింగ్‌ జువెలరీ’కి రోజు రోజుకీ డిమాండ్‌ పెరుగుతోంది.


book3.3.jpgప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఆధునిక ఆభరణాల తయారీ సంస్థలు ఈ మూవింగ్‌ జువెలరీకి సంబంధించి కొత్త కొత్త డిజైన్లతో యువతను అలరిస్తున్నాయి. అయితే ఇవన్నీ భారీగా కాకుండా తక్కువ బంగారంతో, మోడ్రన్‌గా ఉండడం విశేషం. వీటిని సులభంగా ధరించవచ్చు. ఆందోళన కలిగినప్పుడల్లా ఉంగరమో, గొలుసో పట్టుకుంటే చాలు. నెక్లెస్‌లోని గుండును కదపడం, చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని తిప్పడం లాంటివి ఎదుటి వ్యక్తుల దృష్టిని అంతగా ఆకర్షించవు. ఒకవేళ వాళ్లు గమనించినా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఆభరణంతో ఆందోళన తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో... నలుగురిలో ఉన్నామన్న భయం, బిడియం ఏమాత్రం అవసరం లేదు.


నేడు ప్రపంచవ్యాప్తంగా మెంటల్‌ హెల్త్‌ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ యాంటీ యాంగ్జయిటీ ఆభరణాలు కూడా అందులో భాగంగా రూపుదిద్దుకున్నవే. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే జెన్‌ జీలు తమ మానసిక ఆందోళనలను దాచిపెట్టకుండా, అందరికీ తెలిసేలా ఈ నగలను ధరిస్తూ మానసిక సమస్య అనేది దాచుకోవాల్సింది కాదని చెప్పకనే చెబుతూ నలుగురికీ స్ఫూర్తిని కలిగిస్తున్నారు.


book3.4.jpgవైద్యం ఎంత మాత్రం కాదు...

శాస్త్రపరంగా చూస్తే ఇలాంటి యాక్సెసరీలు అప్పటికప్పుడు కలిగే ఆందోళనను దూరం చేయొచ్చు కానీ, పూర్తిగా నయం చేసే చికిత్స అందించలేవని సైకాలజిస్టులు తేల్చి చెబుతున్నారు. అయితే ఏ కదలిక అయినా మళ్లీమళ్లీ చేస్తుంటే నాడీవ్యవస్థలోని ఆందోళనలు తగ్గి, ఆ సమయానికి ఉపశమనం కలుగుతుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. అంటే ఉంగరాన్ని తిప్పడం, హారంలోని గుండును ముందుకూ వెనక్కీ తిప్పడం, శ్వాసను బిగపట్టడం లాంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుందన్నమాట. వీటి వల్ల మనసును ప్రస్తుతంలోకి తీసుకువచ్చి, భయాందోళనలను తాత్కాలికంగా మళ్లించవచ్చు. అంటే రోజువారీ సమస్యల నుంచి బయటపడేందుకు ఇవి దగ్గర దారి చూపిస్తాయి. కానీ దీర్ఘకాలిక వ్యాధులను మాత్రం ఈ పైపై కదలికలతో తగ్గించలేం. కాబట్టి ఆరోగ్య నిపుణులను సంప్రదించాల్సిందే. తగిన మందులను తీసుకోవాల్సిందే.


‘యాంటీ యాంగ్జయిటీ జువెలరీ’ని ట్రెండీ ఫ్యాషన్‌లో భాగంగా... సరదాగా ధరిస్తూ, అప్పుడప్పుడూ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులూ, విరామాల్లో గుండ్లను తిప్పుతూ రోజువారీ ఆందోళనలను తగ్గించుకోవడం మంచిదే. కానీ ఒకవేళ అంతులేని ఆందోళనలు కొన్ని రోజులుగా బాధిస్తుంటే... నిద్ర, పనితీరుపై ప్రభావం చూపిస్తుంటే మాత్రం సంబంధిత ఆరోగ్య నిపుణులను సంప్రదించాల్సిందే. నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని చిన్న చిన్న ఆందోళనల నుంచి... అంటే ఉదాహరణకు వానలవల్ల రోడ్లపై పారుతోన్న డ్రైనేజీ నీళ్లని చూసి సహనం కోల్పోకుండా, కిక్కిరిసిన మెట్రోలో కోపం తెచ్చుకోకుండా, లెక్కల్లో తక్కువ మార్కులతో వచ్చిన చిన్నారి ప్రోగ్రెస్‌ రిపోర్టును చూసి ఆందోళన చెందకుండా,


book3.5.jpgమాడిపోయిన వంటను చూసి ఉసూరుమనకుండా, బాస్‌ కోపానికి బాధపడకుండా, టీచర్‌ పనిష్‌మెంట్‌కు ఫీలవ్వకుండా, రాంగ్‌సైడ్‌లో వచ్చినవాడిపై అరవకుండా... యాంటీ యాంగ్జయిటీ ఆభరణాలతో ఉపశమనం పొందడం ఆరోగ్యపరంగా మంచిదే కదా. మొత్తానికి ఈ కొత్తరకం యాంటీ యాంగ్జయిటీ ఆభరణాలతో జెన్‌ జీలు కోపతాపాలు, అనవసరపు ఆందోళనల నుంచి ఎప్పటికప్పుడు బయటపడే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంతమేరకు తెలివిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. సో... ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యానికి కొనసాగింపుగా ఆరోగ్యమే ఆభరణం అనాలేమో!


book3.6.jpgస్పెషలిస్టులు

ఫ్రాన్స్‌కు చెందిన కార్టియర్‌, యూకేకు చెందిన కామ్‌ కలెక్టివ్‌, స్విట్జర్లాండ్‌కు చెందిన పియాగెట్‌ లాంటి సంస్థలు ‘యాంటీ యాంగ్జయిటీ’ తరహా ప్రత్యేక ఆభరణాలను రూపొందిస్తూ ఓ అడుగు ముందుకు వేశాయి. ‘నిజ జీవితంతో సహజంగా ముడివేసుకుపోయి, ప్రతీరోజునూ హాయిగా, ఆనందంగా గడిపేలా మీకు తోడ్పడే ఆభరణాలను రూపొందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం’ అని ఈ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్లలో ఈ యాంటీ యాంగ్జయిటీ ఆభరణాల గురించి, వాటి ధరలతో పాటు అందుబాటులో ఉంచారు. కంపెనీ స్థాయి, డిజైన్‌ని బట్టి వాటి ధరలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

నాలుగు రోజుల పాటు బంగారం ధరల్లో పెరుగుదల.. ప్రస్తుతం రేట్స్ ఇవీ

15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 08:39 AM