Share News

పెరిగిన జల విద్యుత్‌ ఉత్పాదన

ABN , Publish Date - Aug 09 , 2026 | 06:30 AM

ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో రాష్ట్రంలో జల విద్యుత్‌ ఉత్పాదన భారీగా పెరిగింది. శ్రీశైలం ఎడమ కాలువ, ప్రియదర్శిని జూరాల, లోయర్‌ జూరాల, నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌ కేంద్రాల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే 1.67 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది.

పెరిగిన జల విద్యుత్‌ ఉత్పాదన

  • ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండడంతో పెరిగిన ఉత్పత్తి

  • శ్రీశైలం, జూరాల, సాగర్‌ల్లో కలిపి..శుక్రవారం రాష్ట్రంలో 1.67 కోట్ల యూనిట్ల ఉత్పాదన

  • రాత్రి 12 గంటల తర్వాత పడిపోయిన విద్యుత్‌ ధరలు

  • అర్ధరాత్రి డిమాండ్‌ తగ్గడంతో రేట్ల పతనం

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో రాష్ట్రంలో జల విద్యుత్‌ ఉత్పాదన భారీగా పెరిగింది. శ్రీశైలం ఎడమ కాలువ, ప్రియదర్శిని జూరాల, లోయర్‌ జూరాల, నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌ కేంద్రాల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే 1.67 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో శుక్రవారం 9.97 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. ప్రియదర్శిని జూరాలలో 3.28 మిలియన్‌ యూనిట్లు, లోయర్‌ జూరాలలో 1.60 మిలియన్‌ యూనిట్లు, నాగార్జుసాగర్‌ ప్రధాన విద్యుత్‌ కేంద్రంలో 1.87 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. మొత్తంగా శుక్రవారం 1.67 కోట్ల యూనిట్ల కరెంట్‌ ఉత్పత్తి అయింది. ఒక్కో యూనిట్‌ రూ.4 పలుకుతుండగా విద్యుత్‌ ఉత్పాదన ద్వారా భారీ ఆదాయం సమకూరనుంది. కాగా, శ్రీశైలంలో ఒక్కోటి 150 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టులో జరిగిన ప్రమాదం వల్ల ఇందులోని నాలుగు యూనిట్‌లో పూర్తిగా విద్యుత్‌ ఉత్పాదన నిలిచిపోయింది. ఈ యూనిట్‌ను రెండు వారాల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ఈ యూనిట్‌ అందుబాటులోకి వచ్చి, వరద కొనసాగితే విద్యుత్‌ ఉత్పత్తి మరింత పెరగనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం 2.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా రెండువైపుల జలవిద్యుత్‌ ఉత్పాదనను క్రమంగా పెంచారు. మరోపక్క, అర్ధరాత్రి వేళ విద్యుత్‌ ధరలు పడిపోయాయి. రాత్రి వేళల్లో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడమే ఇందుకు కారణం.


శుక్రవారం రాత్రి 12 గంటల తర్వాత విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. దాంతో బహిరంగ విపణి(ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌)లో విద్యుత్‌ ధరలు నేలచూపులు చూశాయి. ఒకరోజు ముందు(డే ఎహెడ్‌ మార్కెట్‌-ఒక రోజు ముందు వేలంలో పాల్గొనాలి) మార్కెట్‌లో రాత్రి 12 నుంచి 12:15 గంటల మధ్యలో యూనిట్‌ ధర రూ.3.80లుగా రికార్డయింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ తెల్లవారుజామున 4.45 గంటల నుంచి 5 గంటల మధ్య యూనిట్‌ ధర రూ.3.01లుగా రికార్డయింది. ఉదయం 6:30 గంటల నుంచి 6:45 గంటల మధ్యలో యూనిట్‌ ధర రూ.4.36లుగా ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 12:45 గంటల మధ్యలో యూనిట్‌ ధర రూ.1.12లుగా ఉంది. వాతావరణ మార్పులతో గృహ వినియోగం తగ్గడం, పలు రాష్ట్రాల్లో జలవిద్యుత్‌ ఉత్పాదన పెరగడమే దీనికి కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా యూనిట్‌ ధర రూ.10లు తగ్గకుండా ఉండటం గమనార్హం.

Updated Date - Aug 09 , 2026 | 06:31 AM