Somireddy: జగన్ హయాంలో కోట్ల బిల్లులు కాజేశారు.. కాకాణిపై సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:57 AM
వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే రూ.కోట్లు తినేశారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాణి వెంటనే నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నెల్లూరు, జనవరి4(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై (Kakani Govardhan Reddy) మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కాకాణి తన గురించి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రూ.వంద కోట్లు తినేశారని తన గురించి మాట్లాడతారా అని ఫైర్ అయ్యారు. ఆయనకు సిగ్గూ, శరం ఉంటే, రాజకీయ లక్షణాలు ఉంటే నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. నెల్లూరు జిల్లా అంతటా రూ.వందల, కోట్ల పనులు జరిగితే, తాను రూ.వంద కోట్లు తిన్నానని అసత్యాలు మాట్లాడుతారా? అని దుయ్యబట్టారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
జిల్లాలో ఇరిగేషన్ పనులు జరగకుండానే తాను బిల్లులు వసూల్ చేసుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. సిగ్గుతో ఆయన తలదించుకోవాలని విమర్శించారు. వైసీపీ హయాంలో జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే, రూ.కోట్లు తినేశారని ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాణి నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిగ్గూ, శరం లేకుండా మాట్లాడుతారా..?, కాకాణి కంటే సిగ్గులేదని... వారి పత్రికకైనా సిగ్గు ఉండాలి కదా..? అని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
కాకాణి కండీషన్ బెయిల్‌పై ఉన్నావనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రతిరోజూ పోలీసు అధికారులను బెదిరిస్తావా..?, టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేస్తారా? అని ఫైర్ అయ్యారు. పోలీసులంటే కాకాణి అండ్ కోకు భయం లేకుండా పోయిందని మండిపడ్డారు. కాకుటూరులో శివాలయం భూములపై కాకాణి తనపై ఆరోపణలు చేస్తే, వాస్తవాలు నిరూపించానని ప్రస్తావించారు. ఆయన మాత్రం ఈ విషయంలో నవ్వుల పాలయ్యారని విమర్శలు చేశారు. ఇరిగేషన్ శాఖలో రూ.150 కోట్లు తినేశావని ఆరోపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
చివరిలో తాము ఆ బిల్లులు ఆపేశామని గుర్తుచేశారు. పనులు చేయకుండానే ఆ నగదు స్వాహా చేశావని... ఒకే పనికి మూడు, నాలుగు శాఖల నుంచి బిల్లులు ఎందుకు పెట్టారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ఒక్క రోజు ముందు... కాకాణి అల్లుడు ఓ కంపెనీకి సీఈఓ అయిపోయారని ఎద్దేవా చేశారు. ఆ కంపెనీ పేరుతో భూములు కొట్టేశారని ఆరోపించారు. కాకాణి తన గురించి అనవసరంగా మాట్లాడుతున్నావని ధ్వజమెత్తారు. బైరటీస్‌తో ఎన్నో కోట్లు అవినీతికి తెరదీశావని మండిపడ్డారు. ఆరితేరిన దొంగల ముఠా వైసీపీలోనే ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ
Read Latest AP News And Telugu News