Bhogapuram Airport:భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
ABN , Publish Date - Jan 04 , 2026 | 06:25 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగానికి కీలక మైలురాయిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం అత్యంత ఆధునిక సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తయారైనట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్, సీఈఓ రణబీర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
విజయనగరం,జనవరి4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగానికి కీలక మైలురాయిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) రూపుదిద్దుకుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం అత్యంత ఆధునిక సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తయారైనట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్, సీఈఓ రణబీర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని వారు పేర్కొన్నారు.
తొలి బిజినెస్ ఫ్లయిట్ ల్యాండింగ్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి బిజినెస్ ఫ్లయిట్ ఈరోజు(ఆదివారం) ఉదయం 10:15 నిమిషాలకు మొదటి విమానం ల్యాండ్ కానుంది. ఈ చారిత్రక సందర్భంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రయాణించనున్నారు. ఈ ట్రయల్ రన్ భోగాపురం విమానాశ్రయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలవనుంది.
అత్యాధునిక సౌకర్యాలు
ఈ విమానాశ్రయంలో ఒకేసారి 300 విమానాలు దిగే సదుపాయాలు కల్పించడం విశేషం. అంతర్జాతీయ బిడ్స్ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్‌బస్ A380, బోయింగ్ 747-8 వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేలను డిజైన్ చేశారు.
ప్రయాణికుల సామర్థ్యం
తొలి దశలోనే ప్రతి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న టెర్మినల్‌ను నిర్మించనున్నారు. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
వ్యయం, రవాణా మార్గాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ నిర్మాణానికి రూ.4,592 కోట్ల వ్యయం కేటాయించినట్లు విమానయాన శాఖ తెలిపింది. భోగాపురం నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి మూడు ప్రధాన రహదారి మార్గాలు సిద్ధం చేయడం వల్ల ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.
అభివృద్ధికి బలమైన ఆధారం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విమానయాన మ్యాప్‌లో మరింత బలంగా నిలబెట్టనుంది. వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఇది కీలక కేంద్రంగా మారనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
వైసీపీ హయాంలో డ్రగ్స్‌కి.. ఏపీ క్యాపిటల్‌గా ఉండేది..
గంజాయికి ‘నో’ చెప్పి భవిష్యత్ సురక్షితం చేసుకోండి
Read Latest AP News And Telugu News