Share News

రూ.240 కోట్ల నిధులపై సంబరాలు.. కూటమి నేతలకు దిష్టి తీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:21 AM

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు నగర కార్పొరేషన్‌కు రూ.240 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

రూ.240 కోట్ల నిధులపై సంబరాలు.. కూటమి నేతలకు దిష్టి తీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, సెప్టెంబర్ 22: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు నగర కార్పొరేషన్‌కు రూ.240 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ చిత్రపటాలకి ఎమ్మెల్యే కోటంరెడ్డి దిష్టి తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోందన్నారు. భావితరాల భవిష్యత్ కోసం అనేక పరిశ్రమలను తీసుకొస్తున్నారని తెలిపారు. నగర అభివృద్ధికి 240 కోట్ల రూపాయలు నెల్లూరు నగర కార్పొరేషన్‌కు ప్రభుత్వం కేటాయించిందన్నారు. వైసీపీ దిష్టి, శాపనార్ధాలు, తిట్లు కూటమికి తగలకూడదని దిష్టి తీశామని చెప్పారు.


త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోందని ఎమ్మెల్యే అన్నారు. చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో రెండున్నరేళ్లలో రూరల్‌లో విస్తృత అభివృద్ధి చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరో రూ.300 కోట్ల నిధులు కార్పొరేషన్‌కు వచ్చేలా మంత్రి నారాయణ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమిని గెలిపించాలని ప్రజలని కోరుతున్నామన్నారు. 1000 ఓట్లు తక్కువ కాకుండా 72 డివిజన్లలో క్లీన్ స్వీప్‌తో కూటమికి గెలుపు గిఫ్ట్ ఇవ్వాలన్నారు.


కూటమి మేయర్ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందించాలని కోటంరెడ్డి కోరారు. వైసీపీ ఎలాగో అధికారంలో లేదని.. ఒకటి రెండు చోట్ల వాళ్లు గెలిచినా ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ సొంత కార్పొరేషన్‌లో 100 శాతం గెలుపు ఉండాలని ప్రజలకి పిలుపునిస్తున్నామని అన్నారు. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. జెన్‌ జీ యువతలో 21 నుంచి 35 ఏళ్లలోపు వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోటీ చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. టికెట్లు ఎవరు అయినా ఆశించవచ్చని.. ఒక్కసారి టికెట్ వచ్చాక అందరూ కలిసి గెలుపుకోసం పని చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పాలిటెక్నిక్‌ యథాతథం!

విశాఖపట్నంలో గన్ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 11:32 AM