Share News

నంద్యాల జిల్లాలో రాజకీయ సెగలు.. అఖిలప్రియ వర్సెస్ బ్రిజేంద్రనాథ్ రెడ్డి

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:31 PM

నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బయలుదేరడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది.

నంద్యాల జిల్లాలో రాజకీయ సెగలు.. అఖిలప్రియ వర్సెస్ బ్రిజేంద్రనాథ్ రెడ్డి
Bhuma Akhila Priya

నంద్యాల జిల్లా, జులై 8 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) బయలుదేరడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి అలియాస్ నాని.. అఖిలప్రియపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి అఖిలప్రియ నేరుగా వెళ్లనున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు గంగుల నాని అహోబిలానికి రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. అయితే నాని అక్కడకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు అఖిలప్రియ బయలుదేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో రెండు వర్గాల్లోని అనుచరులు పెద్ద సంఖ్యలో ఆళ్లగడ్డకు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. గంగుల నాని నివాసం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


మరోవైపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు వస్తున్నారనే సమాచారం రావడంతో ఆమె అనుచరులు, గంగుల నాని వర్గీయులు అప్రమత్తమయ్యారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ రాజకీయ పరిణామాలపై స్థానిక ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అఖిలప్రియ, గంగుల నాని మధ్య నెలకొన్న ఈ తాజా పరిణామాలు నంద్యాల జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: పవన్ కల్యాణ్

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 07:20 PM