కూటమి ధర్మాన్ని పాటిస్తూనే స్థానిక ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం: మంత్రి కందుల దుర్గేశ్
ABN , Publish Date - Aug 31 , 2026 | 09:30 PM
కూటమి ధర్మాన్ని పాటిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమవుతుందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. 2021 స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా జనసైనికులు, వీరమహిళలు గొప్ప పోరాట పటిమ చూపించారని కొనియాడారు.
నంద్యాల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కూటమి ధర్మాన్ని పాటిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమవుతుందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) స్పష్టం చేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా జనసైనికులు, వీరమహిళలు గొప్ప పోరాట పటిమ చూపించారని కొనియాడారు. ఈరోజు (సోమవారం) నంద్యాల జిల్లాలో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 14 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. కూటమి ధర్మానికి భంగం కలగకుండా క్షేత్రస్థాయి నుంచి జనసేనను మరింత బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.
చంద్రబాబు దార్శనిక నేత..
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేసి సీఎం చంద్రబాబు చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారని మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేసి, మూడు దశాబ్దాల తర్వాత ఆయనే ప్రారంభించడం అరుదైన సంఘటన అని ఉద్ఘాటించారు. చంద్రబాబు దార్శనిక నేత అని కొనియాడారు. సంక్షేమం - అభివృద్ధిని సమతుల్యం చేస్తూ చంద్రబాబు సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. వెలిగొండ ప్రాజెక్ట్ రాకతో ఎండిపోయిన భూములకు కృష్ణా జలాలు చేరి రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని చెప్పారు.
పర్యాటకరంగం అభివృద్ధి చెందాలి..
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వెలిగొండ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి వర్కౌట్ చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం, ఆసియాలోనే అతిపెద్ద కంబం చెరువు, భైరవకోణ, నల్లమల అడవులతో కలిపి 'టూరిజం సర్క్యూట్' గా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పర్యాటకాభివృద్ధి కోసం రూపొందించిన యాక్షన్ ప్లాన్ బ్రోచర్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశామని తెలిపారు. పర్యాటకరంగం అభివృద్ధి చెందితేనే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..
వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు: బొండా ఉమా
తిరుపతి నైలిట్ సంస్థ మూసివేతపై క్లారిటీ.. అసలు విషయమిదే
Read Latest AP News And Telangana News And National News
And Telugu News