అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లపట్టాల పంపిణీ: మంత్రి జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:23 PM
నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత ఇళ్ల పట్టాలు బనగానపల్లె ప్రజల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లెలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) వ్యాఖ్యానించారు. సొంత ఇళ్ల పట్టాలు బనగానపల్లె ప్రజల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ కూటమి ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని.. గత ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. ఈరోజు (బుధవారం) నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అర్జీలు తీసుకుని మోసం చేశారు..
వైసీపీ హయాంలో మూడు వేల మందికి పైగా పట్టాలు ఇస్తామని అర్జీలు తీసుకుని మోసం చేశారని మంత్రి విమర్శించారు. సహజంగా ఇళ్ల పట్టాల పంపిణీలో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. జగన్ హయాంలో డబ్బులకు ఆశపడి స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నాటి ఇళ్ల పట్టాల జాబితాపై విచారణ చేపట్టి అనర్హులను గుర్తించామని చెప్పుకొచ్చారు. దాదాపు 1800 మంది స్థానికేతరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. కాబట్టి మళ్లీ నూతనంగా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు.
ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలి..
నేడు అర్హులైన ప్రతి ఒక్కరూ ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. ఆరు దశల వెరిఫికేషన్ పూర్తి చేసి, ప్రభుత్వ నిబంధనల మేరకు, ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని, ఎవరైనా దళారులు డబ్బులు అడిగితే ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో డబ్బులు తీసుకుని పట్టాలిప్పిస్తామన్న సంఘటనలు ఉన్న క్రమంలో ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో ఎవరి పైరవీలు పని చేయవని స్పష్టం చేశారు. అర్హతను ప్రాతిపదిక తీసుకుని పట్టాల పంపిణీ ప్రక్రియ అమలు చేస్తామని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో అంటే.. అక్టోబర్ 12వ తేదీ లోపు రిజిస్టర్ అయిన అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News